‘ఎదురుచూసే పరిస్థితి తీసుకురావొద్దు’.. అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |

ఇటీవ‌ల కామారెడ్డి, మెద‌క్ జిల్లాల్లో కురిసిన భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేప‌ట్టిన స‌హాయ‌క చ‌ర్యల‌ను మ‌రింత ముమ్మరం

‘ఎదురుచూసే పరిస్థితి తీసుకురావొద్దు’.. అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవ‌ల కామారెడ్డి, మెద‌క్ జిల్లాల్లో కురిసిన భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేప‌ట్టిన స‌హాయ‌క చ‌ర్యల‌ను మ‌రింత ముమ్మరం చేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన‌ల మేర‌కు బుధ‌వారం సెక్రెటేరియట్‌లోని త‌న కార్యాల‌యంలో భారీ వ‌ర్షాలతో జ‌రిగిన న‌ష్టం, ఇప్పటివ‌ర‌కు తీసుకున్న స‌హాయ‌క చ‌ర్యల‌పై ఆయా శాఖల వారీగా సమీక్షించారు. సీఎస్ కె.రామ‌కృష్ణారావు, రాష్ట్ర ప్రకృతి విప‌త్తుల నిర్వహ‌ణా విభాగం ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి అర‌వింద్ కుమార్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యద‌ర్శి సుల్తానియాతో క‌లిసి స‌మావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ముంద‌స్తు చ‌ర్యల వ‌ల్ల చాలా వ‌ర‌కు ప్రాణ‌, ఆస్తి న‌ష్టం త‌గ్గింద‌న్నారు. ఇప్పటివ‌ర‌కు ప‌రిహారం విడుద‌ల చేయ‌క‌పోతే వాటిని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని అధికారుల‌కు సూచించారు.

ఏ ఒక్క బాధితుడు ప‌రిహారం కోసం ఎదురుచూడాల్సిన ప‌రిస్థితి లేకుండా చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు. చెరువులు, కుంట‌లు, రోడ్ల మ‌ర‌మ్మతులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల‌ని సూచించారు. వ‌ర్షాల‌తో తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాల‌కు రూ.10 కోట్లు, సాధార‌ణ నష్టం జ‌రిగిన జిల్లాల‌కు రూ.5 కోట్లను విడుద‌ల చేసినట్లు చెప్పారు. స‌హాయ‌క చ‌ర్యల‌ను ఆయా జిల్లా క‌లెక్టర్లతో స‌మ‌న్వయం చేసుకొని హైద‌రాబాద్ నుంచి ఆయా విభాగాధిప‌తులు నిరంతరం ప‌ర్యవేక్షించాల‌ని సూచించారు. వ‌ర‌ద స‌హాయానికి సంబంధించి వినియోగించిన నిధుల‌కు యూసీల‌ను కేంద్రానికి అందించ‌డంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 13వ తేదీలోగా ఆయా విభాగాలు యూసీల‌ను స‌మ‌ర్పించాల‌ని ఆదేశించారు. అల్పపీడ‌నం కార‌ణంగా వ‌చ్చే రెండు రోజుల‌పాటు ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరిక‌ల నేప‌థ్యంలో అధికారులు అప్రమ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

జ‌ర్నలిస్టుల స‌మ‌స్యల‌పై స‌మీక్ష

నిజ‌మైన జ‌ర్నలిస్టుల‌కు మేలు జ‌రిగేలా నిర్ణయాలు ఉండాల‌ని మంత్రి పొంగులేటి అధికారుల‌కు సూచించారు. స‌చివాల‌యంలో ప్రెస్ అకాడ‌మీ చైర్మన్ కె.శ్రీ‌నివాస‌రెడ్డి, ఐఅండ్‌పీఆర్ స్పెషల్ క‌మిష‌న‌ర్ సీహెచ్‌ ప్రియాంక‌, సీపీఆర్‌వో జి.మ‌ల్సూర్‌తో క‌లిసి సమీక్ష నిర్వహించారు. ఈ స‌మావేశంలో ప్రధానంగా అక్రిడిటేష‌న్ పాల‌సీ, జ‌ర్నలిస్ట్‌ల హెల్త్ పాల‌సీ, జ‌ర్నలిస్టుల అవార్డులు, జ‌ర్నలిస్టుల‌పై దాడుల‌కు సంబంధించి హైప‌వ‌ర్ క‌మిటీ త‌ద‌త‌ర అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఈ అంశాల‌పై కార్మిక‌, ఆరోగ్య, హోం, ఆర్థిక‌శాఖ అధికారుల‌తో త్వర‌లో మ‌రోసారి స‌మావేశం నిర్వహించాల‌ని నిర్ణయించారు.

Next Story