- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎట్టి పరిస్థితుల్లో వారి నమ్మకాన్ని వమ్ము చేయొద్దు: మంత్రి పొంగులేటి ఆదేశం
ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి అమలులో కలెక్టర్లే మార్గదర్శకులు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి అమలులో కలెక్టర్లే మార్గదర్శకులు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో నిర్మల్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, వనపర్తి జిల్లాల కలెక్టర్లతో భూభారతి, ఇందిరమ్మ ఇండ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పథకాలను సమర్థవంతంగా అమలు చేసి వాటి ఫలితాలు పేదలకు అందేలా చూడాలన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడితే భూ సమస్యలకు విముక్తి లభిస్తుందని, సొంతింటి కల నెరవేరుతుందని ప్రజానీకం అత్యంత నమ్మకంతో తమకు అధికారం అప్పగించారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనల మేరకు భూ భారతి, ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. చట్టాన్ని రూపొందించడం ఒక ఎత్తైతే.. దాన్ని అమలు చేయడం మరో ఎత్తని.. ఈ చట్టం ఫలితాలు ప్రతి పేదవానికి అందినప్పుడే సార్ధకత నెరవేరుతుందన్నారు.
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆ ప్రభావం ఇందిరమ్మ ఇండ్లపై పడకుండా ప్రతి సోమవారం నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక, ఇండ్ల మంజూరు, నిర్మాణ పనుల పర్యవేక్షణను పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఇండ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించాలని సూచించారు. అనర్హులని తేలితే ఇంటి నిర్మాణం మధ్యలో ఉన్నా రద్దు చేయడానికి వెనకాడ వద్దన్నారు. ప్రతి ఇల్లు అర్హులకే అందాలన్నారు. ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుక అందేలా పర్యవేక్షించాలని.. అలాగే ఇంటి నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంట్ ఇటుకల కోసం మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలన్నారు.






