తెలంగాణలో గుడిసెలు కనిపించొద్దు.. అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం

by Gantepaka Srikanth |

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివ‌రకు 3.60 ల‌క్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయ‌గా.. ఇందులో ల‌క్ష ఇండ్లకు ఈ నెల 31వ తేదీలోగా గృహ‌ప్రవేశాలు చేయనున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

తెలంగాణలో గుడిసెలు కనిపించొద్దు.. అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివ‌రకు 3.60 ల‌క్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయ‌గా.. ఇందులో ల‌క్ష ఇండ్లకు ఈ నెల 31వ తేదీలోగా గృహ‌ప్రవేశాలు చేయనున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శ‌నివారం సెక్రెటేరియట్‌లోని త‌న కార్యాల‌యం నుంచి ప్రజాపాల‌న‌-ప్రగ‌తి నివేదిక 99 రోజుల్లో చేప‌ట్టవ‌ల‌సిన కార్యాచ‌ర‌ణ‌పై జిల్లా హౌసింగ్ పీడీల‌తో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతీ పేద‌వాడి ఆత్మగౌర‌వానికి చిహ్నంగా నిలిచేలా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థకం అమ‌లు చేస్తున్నదని.. ఇది ఒక బెంచ్ మార్క్‌గా నిల‌వ‌బోతున్నదని వెల్లడించారు. త్వరలోనే గృహప్రవేశాలకు అనుకూలమైన తేదీలను అధికారికంగా తెలియజేస్తామని తెలిపారు. ఇండ్లు మంజూరు చేసిన త‌ర్వాత కూడా కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ పూరిగుడిసెలు కనిపిస్తున్నాయని, అటువంటి కుటుంబాలకు అత్యంత‌ ప్రాధాన్యత ఇచ్చి ఇళ్ల నిర్మాణంలో చేర్చాలని ఆదేశించారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యంతో చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మంజూరు చేసిన ఇండ్లలో 20 శాతం వ‌ర‌కు గ్రౌండింగ్ కాలేద‌ని.. అలాంటి ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల సమ్మతి తీసుకుని స్థానిక ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీల సూచనలతో మార్చి 31లోపు అన్ని గ్రౌండింగ్‌ అయ్యేలా యుద్ధప్రాతిప‌దిక‌న‌ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏప్రిల్‌లో రెండో ద‌శ ఇందిర‌మ్మ ఇండ్లు మంజూరు చేసేనాటికి మొద‌టి ద‌శ ఇండ్లు కొలిక్కిరావాల‌ని సూచించారు.

ధరలను నియంత్రించాలి..

ఇండ్ల నిర్మాణంలో ఉపయోగించే నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం వల్ల లబ్ధిదారులపై అదనపు భారం పడకుండా జిల్లా స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు చురుకుగా పనిచేయాలని మంత్రి సూచించారు. అవసరమైతే జిల్లా కలెక్టర్లతో కలిసి సమీక్షించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇటుకల సరఫరా పెంచేందుకు స్థానికంగా ఎస్‌హెచ్‌జీ మ‌హిళా సంఘాల ద్వారా బ్రిక్ యూనిట్లను ప్రోత్సహించాల‌ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిర‌మ్మ ఇండ్ల కోసం ఉచిత ఇసుక పంపిణీ చేస్తున్నద‌ని.. ల‌బ్ధిదారుల‌కు ఎక్కడా స‌మ‌స్య రాకుండా చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు. ఇండ్లను మంజూరు చేసి ఒకటి లేదా రెండు విడతల చెల్లింపులు చేసిన తర్వాత వివిధ కార‌ణాల‌తో చెల్లింపులు నిలిపివేయ‌డం స‌రికాద‌న్నారు. ఇటువంటి చెల్లింపులను త‌క్షణ‌మే క్లియ‌ర్ చేయాల‌ని లేని ప‌క్షంలో అధికారుల‌పై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవ‌డానికి వెన‌కాడ‌బోమ‌ని హెచ్చరించారు. రెండో విడ‌తలో ఇటువంటి ప‌రిస్థితి పున‌రావృతం కాకుండా ముంద‌స్తు చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు.

Next Story