- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేం హామీని నిలబెట్టుకున్నాం: మంత్రి పొంగులేటి
రాష్ట్రంలో గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని గ్రామపాలనాధికారుల(జీపీవో) నియామకంతో నిలబెట్టుకున్నామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని గ్రామపాలనాధికారుల(జీపీవో) నియామకంతో నిలబెట్టుకున్నామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూ సమస్యలపై తెలంగాణ ప్రజానీకానికి, రైతాంగానికి మరింత మెరుగైన సేవలందించడానికి రెవెన్యూ వ్యవస్ధను బలోపేతం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రెవెన్యూ సేవలను గ్రామ స్ధాయి వరకు అందించడానికి జీపీవో సేవలను ఒకటి, రెండు రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఈ నెల 5న శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సాయంత్రం 4 గంటలకు జీపీవోలకు హైటెక్స్‌లో నియామక పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. గురువారం సచివాలయంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. జీపీవోలుగా విధులు నిర్వహించడానికి ఆసక్తి చూపిన వీఆర్వో, వీఆర్ఏలకు రెండు విడతల్లో నిర్వహించిన రాత పరీక్షల్లో 5,106 మంది ఎంపికయ్యారని మంత్రి తెలిపారు. వీరి రాకతో గ్రామ స్థాయిలో ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత బాగా అందుతాయన్నారు.
ఆనాటి ప్రభుత్వ పెద్దలు చెబితే వినలేదన్న అక్కసుతో వీఆర్వో, వీఆర్ఏల వ్యవస్దను రద్దు చేశారని, ఈ చర్య వలన గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు రెవెన్యూ సేవలు దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రెవెన్యూ సేవలు గ్రామ స్థాయి వరకు అందించాలనే లక్ష్యంతో గ్రామ పరిపాలనాధికారులను నియమిస్తున్నామన్నారు. చారిత్రాత్మకమైన భూభారతి చట్టం ద్వారా రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టామన్నారు. రెవెన్యూ, సర్వే విభాగానికి మధ్య అవినాభావ సంబంధం ఉందని, సర్వే విభాగం బలోపేతం తోనే రెవెన్యూ వ్యవస్ధలో మెరుగైన సేవలు అందించగలుగుతామన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని సర్వే విభాగాన్ని బలోపేతం చేస్తున్నామని, గత పదేళ్ళలో సర్వే విభాగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన నేపధ్యంలో ఇందుకు అవసరమైన లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను కూడా వచ్చే నెల మొదటి వారంలోగా అందుబాటులోకి తీసుకురాబోతున్నామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే మొదటి విడతలో 7 వేల మందికి శిక్షణ ఇవ్వడం, అర్హత పరీక్ష నిర్వహించడం పూర్తయినట్లు వివరించారు. 40 రోజుల పాటు నిర్వహిస్తున్న అప్రెంటిస్ శిక్షణ కూడా త్వరలో పూర్తి చేసుకోబోతున్నారని తెలిపారు. గత నెల 18వ తేదీ నుంచి రెండవ విడతలో మూడు వేల మందికి 21 జిల్లాల్లో శిక్షణ ప్రారంభించినట్లు తెలిపారు.






