- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: పదేండ్లుగా భ్రష్టుపట్టిన రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన: మంత్రి పొంగులేటి
తెలంగాణలో దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టిందని, విధ్వంసమైన వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టిందని, విధ్వంసమైన వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. స్వరాష్ట్రంలో ఏళ్ల తరబడి ప్రజలు ఎదుర్కొన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఆశయంతో తీసుకొచ్చిన భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. రెవెన్యూ వ్యవస్థలో భూ భారతికి ముందు భూ భారతి తర్వాత స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ముగిసిన నేపధ్యంలో మంత్రి శనివారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాటి ప్రభుత్వం ఎంతో గొప్పగా 2020లో తీసుకువచ్చిన ఆర్వోఆర్ చట్టాన్ని తిరగరాసి పారదర్శక పాలనకు పెద్ద పీట వేస్తూ రైతులు కష్టాలు తీర్చడమే ధ్యేయంగా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. పదేళ్లలో రైతులు పడ్డ కష్టాలు, బాధలు.. ఏ విధమైన సమస్యలను ఎదుర్కొన్నారో చెప్పడానికి ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. మూడు దశల్లో దాదాపు 10 లక్షలకు పైగా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయన్నారు. ఏప్రిల్ 14వ తేదీన భూ భారతి చట్టాన్ని ఆవిష్కరించుకున్నామని, నాటి నుంచే రెవెన్యూ వ్యవసస్థలో నూతన శకం ప్రారంభమైందన్నారు. ఈ చట్టాన్ని దశల వారీగా అమలులోకి తీసుకొస్తున్నామన్నారు.
అత్యధికం ఖమ్మంలోనే..
మొదటి దశలో ఏప్రిల్ 17 నుంచి 30వ తేదీ వరకు నాలుగు మండలాల్లో నిర్వహించిన 72 రెవెన్యూ సదస్సుల్లో 12వేల దరఖాస్తులు, తర్వాత రెండో దశలో మే 5వ తేదీ నుంచి 28 మండలాల్లో నిర్వహించిన 414 సదస్సుల్లో 46 వేల దరఖాస్తులు వచ్చాయని మంత్రి చెప్పారు. ఇందులో సాదాబైనామాల అంశం మినహా సుమారు 60 శాతం పైగా సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 561 మండలాల్లో 10,239 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించామని, భూ సమస్యలకు సంబంధించి 8.58 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. మూడు విడతల్లో 593 మండలాల్లో 10,725 రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, ఇందులో 8.58 లక్షల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 67 వేలు, భద్రాద్రి కొత్తగూడెం 61 వేలు, వరంగల్ 54 వేలు, జయశంకర్ భూపాలపల్లి 48 వేలు, నల్గొండ 42 వేల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. రెవెన్యూ సదస్సులకు ముందు రోజే ఆయా గ్రామాల్లో రైతులకు ఉచితంగా దరఖాస్తులను ఇచ్చామని, ఎమ్మార్వో ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. రెవెన్యూ అధికారులే ప్రజల వద్దకు వచ్చి ఎలాంటి రుసుము లేకుండా దరఖాస్తులను స్వీకరించారన్నారు. స్వీకరించిన వాటికి రశీదులను అందచేసినట్లు చెప్పారు. దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 3.27 లక్షల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం చేశారని, మిగిలిన వాటిని కూడా త్వరితగతిన నమోదు చేయాలని అధికారులకు సూచించారు.






