బీఆర్ఎస్‌తో బీజేపీ చేతులు కలిపింది: మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ను కాద‌ని క‌మీష‌న్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను చేప‌ట్టి ఎనిమిదో వింత‌గా ప్రచారం చేసుకున్నదని పొంగులేటి ఆరోపించారు.

బీఆర్ఎస్‌తో బీజేపీ చేతులు కలిపింది: మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచి ఇప్పటివ‌ర‌కు జ‌రిగిన పార్లమెంటు, ఉప ఎన్నిక‌లు, పంచాయతీరాజ్, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ప్రజ‌లు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప‌ట్టం క‌ట్టడాన్ని.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రగతిని తట్టుకోలేక కేసీఆర్ అండ్ కో విషప్రచారం చేస్తున్నదని మంత్రులు పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ఆరోపించారు. గురువారం సెక్రెటేరియట్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్‌కు బీజేపీ నేత‌లు వంత‌పాడుతున్నార‌ని ఆరోపించారు. 2023 జూలై 15న వెలుగుమ‌ట్లలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పేద‌ల ఇండ్లను కూల‌గొట్టించింద‌ని చెప్పారు. అంతేగాక వెలుగుమెట్లలో పేద‌ల‌కు ఇండ్లు తిరిగి క‌ట్టిస్తామ‌ని హామీ ఇచ్చి గాలికి వ‌దిలేసిందన్నారు. కానీ, ఇందిర‌మ్మ ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వుల‌కు అనుగుణంగా అక్కడ అక్రమంగా ఉన్న ఇండ్లను తొల‌గించ‌డం జ‌రిగిందని తెలిపారు. సీఎం రేవంత్ సూచనల మేరకు అక్కడ అర్హులైన పేద‌ల‌కు ఇంటి స్థలం, ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. పేద‌లే ఇందిరమ్మ ప్రభుత్వం పేటెంట్ అని.. పేద‌ల‌పై బీఆర్ఎస్ బావబావమరుదులు, ఫాంహౌస్‌లో ఉండి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వారు వెంట‌నే స్పందించి కాళేశ్వరంలో దోచుకున్న, దాచుకున్న సొమ్ములో కొంత భాగాన్ని బ‌య‌ట‌కు తీసి పేద‌ల‌కు ఇళ్లు క‌ట్టించి పాప ప‌రిహారం చేసుకోవాల‌ని సూచించారు.

కేసీఆర్, కేటీఆర్, హరీశ్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి..

గ‌త బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ను కాద‌ని క‌మీష‌న్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను చేప‌ట్టి ఎనిమిదో వింత‌గా ప్రచారం చేసుకున్నదని పొంగులేటి ఆరోపించారు. వారి హయాంలోనే లక్షలాది కోట్ల ప్రాజెక్ట్ కట్టడం, అవినీతి కార‌ణంగా బీట‌లువార‌డం కూడా జ‌రిగిందని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లలో 168 టీఎంసీల నీరు ఇస్తామ‌ని చెప్పి దీనిలో 50 టీఎంసీల నీటిని స‌ముద్రం పాలు చేశారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్‌కు ఏటీఎంగా మారింద‌న్న బీజేపీ నేత‌లు ఆ పార్టీతో చేతులు కలిపారని అన్నారు. జ‌స్టిస్ ఘోష్ క‌మిష‌న్ నివేదిక ఇచ్చినా.. అసెంబ్లీలో తీర్మానం చేసి సీబీఐకి ఇచ్చినా ఇంత‌వ‌ర‌కు కేంద్రం క‌నీసం స్పందించ‌లేదన్నారు. బీఆర్ఎస్ గ‌తంలో వ‌దిలేసిన ప్రాజెక్ట్‌ల‌ను తాము పూర్తిచేస్తున్నామని వెల్లడించారు. వచ్చేనెల 16 నుంచి ప్రారంభ‌మ‌య్యే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌, బావ బావ‌మ‌రుదులు వ‌చ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. వారు గ‌తంలో ప్రతిప‌క్షానికి మాట్లాడే అవ‌కాశం ఇవ్వలేదని.. తాము కచ్చితంగా అవ‌కాశం ఇస్తామని వెల్లడించారు. అసెంబ్లీకి వచ్చి సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు.

ఉత్తర తెలంగాణకు బీఆర్ఎస్ అన్యాయం

బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి ప్రాజెక్ట్‌ల విష‌యంలో ఉత్తర తెలంగాణ‌కు పూర్తిగా అన్యాయం చేసిందని మంత్రి పొన్నం ప్రభాక‌ర్ అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 48వేల కోట్లు మిత్తీగా క‌ట్టిందన్నారు. తమ ప్రభుత్వం వ‌చ్చాక శ్వేత ప‌త్రం ఇచ్చామని.. కాళేశ్వరంపై చ‌ర్చించామని తెలిపారు. కేంద్రం చ‌ర్యలు తీసుకోవాలని కోరామని అన్నారు. మంత్రి వివేక్ వెంక‌టస్వామి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడడం వల్లనే దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో ధ‌నిక పార్టీగా మారిందన్నారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయిల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఎల‌క్ట్రోర‌ల్ బాండ్లు దీనికి నిద‌ర్శనమని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ న‌ష్టాన్ని కేసీఆర్ నుంచి వ‌సూలు చేయాల్సిన అవ‌స‌రం ఉన్నదన్నారు. కాంట్రాక్టర్లు, కాసుల కోస‌మే బీఆర్ఎస్ అనుకూల నీటి ప్రాజెక్ట్‌ల‌ను చేప‌ట్టిందన్నారు.

Next Story