రూపాయి ఖర్చు లేకుండా మళ్లించొచ్చు.. ఈ తెలివి బీఆర్ఎస్‌కు లేదు: పొంగులేటి

by Gantepaka Srikanth |

వృథాగా సముద్రంలోకి వెళ్తున్న మున్నేరు వాగు వరద నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా పాలేరు రిజర్వాయర్‌కు మళ్లించడానికి మున్నేరు-పాలేరు లింక్ కెనాల్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.162.54 కోట్లు విడుదల చేసిందని రెవెన్యూ, హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

రూపాయి ఖర్చు లేకుండా మళ్లించొచ్చు.. ఈ తెలివి బీఆర్ఎస్‌కు లేదు: పొంగులేటి
X

దిశ, తెలంగాణ బ్యూరో: వృథాగా సముద్రంలోకి వెళ్తున్న మున్నేరు వాగు వరద నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా పాలేరు రిజర్వాయర్‌కు మళ్లించడానికి మున్నేరు-పాలేరు లింక్ కెనాల్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.162.54 కోట్లు విడుదల చేసిందని రెవెన్యూ, హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించి జీవో 98 విడుదలైనట్లు తెలిపారు. సముద్రంలోకి పోయే వరద నీటిని రూపాయి ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా మళ్లించాలన్న ఆలోచన ఈ రాష్ట్రాన్ని పదేళ్లు ఏలిన ప్రభుత్వానికి రాలేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ తీసుకున్న తాజా నిర్ణయంతో వృథాగా పోతున్న వరద నీటిలో సుమారు 10 టీఎంసీలు పాలేరు రిజర్వాయర్‌కు మళ్లించవచ్చని తెలిపారు. దీనివల్ల ఈ రిజర్వాయర్ పరిధిలో 2.54 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని పేర్కొన్నారు. ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే 1.30 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని తెలిపారు. సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు తాగునీరు, డోర్నకల్ నియోజకవర్గం పరిధిలో పది చెరువులకు సాగునీరు ఉపయోగపడుతుందని తెలిపారు. నిర్దేశించిన గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడించారు. అలాగే.. పాలేరు లింక్ కెనాల్‌కు నిధులు విడుదల చేసిన సీఎం, ఇరిగేషన్ శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Next Story