‘దమ్ముంటే టచ్ చేసి చూడండి..’ BRS, బీజేపీలకు మంత్రి పొంగులేటి మాస్ వార్నింగ్..!

by Disha Web Desk 19 |
‘దమ్ముంటే టచ్ చేసి చూడండి..’ BRS, బీజేపీలకు మంత్రి పొంగులేటి మాస్ వార్నింగ్..!
X

‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామని కొందరు కారుకూతలు కూస్తున్నారు. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం. అదిచేస్తాం.. ఇది చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అంతేకాదు నా మీదా కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాకు సముచితమైన స్థానం ఇచ్చింది. చాలా గౌరవప్రదమైన, ఉన్నతమైన స్థానాన్ని కల్పించింది. ఇక్కడ చాలా కంఫర్ట్‌గా ఉన్నా. ఇంకో పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అంత తీరికా లేదు. బీఆర్ఎస్ నాయకులు కొందరు పనిగట్టుకుని నాపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.’

దిశ బ్యూరో, ఖమ్మం: రాబోయే ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ప్రగల్బాలు పలుకుతున్నారని, వారి ఆటలు సాగవని గృహ నిర్మాణ, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వమని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని టచ్ చేస్తే ప్రజలే దిమ్మదిరిగే సమాధానం చెబుతారన్నారు. శుక్రవారం ‘దిశ’ ప్రతినిధికిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాల గురించి మాట్లాడుతూ.. దమ్మూధైర్యం ఉంటే కేసీఆర్‌కు టచ్‌లో ఉన్న కాంగ్రెస్ నాయకులెవరో చెప్పాలని డిమాండ్ చేశారు.

బీజేపీ ఆలోచనను ప్రజలు గమనించాలి..

గడిచిన పది సంవత్సరాల్లో దేశంలో కులాలు, మతాలు, ప్రాంతాలు.. చివరకు భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేవలం ముస్లింలు, క్రైస్తవులకు మాత్రమే అండగా ఉంటుందని, పేదవారిని విస్మరిస్తుందని ఒక క్యాసెట్ పెట్టుకుని ఈనాడు దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల మంగళసూత్రాలను తెంపి క్రైస్తవులకు, ముస్లింలకు ఇస్తుందని విష ప్రచారం చేస్తుంది. బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి ముప్పు తెచ్చే విధంగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా బీజేపీ ప్రవర్తిస్తుంది. మూడోసారి ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఇక ఈ ఎన్నికలే చివరివి. ఒక్క రిజర్వేషన్లను ఎత్తివేయడమే కాదు.. ప్రజాస్వామ్యబద్దంగా ప్రజలచేత ప్రభుత్వాలను ఎన్నుకునే వ్యవస్థనూ నిర్వీర్యం చేయాలనే లక్షంతో బీజేపీ వ్యవహరిస్తుంది. ఈ తరహా ఆలోచనలు భారత వ్యవస్థకే పెనుముప్పు. ప్రజలు బీజేపీ వ్యవహారాన్ని గమనించి కాంగ్రెస్ ను ఆదరించాలి.

బీఆర్ఎస్‌ది ఆరంభ శూరత్వం..

జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించి, తెలంగాణ సొమ్ము లక్షల కోట్లు కొల్లగొట్టి ఆ డబ్బు దేశవ్యాప్తంగా విరజిమ్మి వివిధ రాష్ట్రాలలో ఔట్ డేటెడ్ పొలిటీషన్లను తీసుకుని బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని ఓ లెబుల్ వేసుకుని ఈనాడు తెలంగాణకే పరిమితమైంది. వివిధ రాష్ట్రాలలో బీఆర్ఎస్ బోర్డు తిప్పేసింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 543 సీట్లలో బీఆర్ఎస్ కేవలం తెలంగాణలోని 17 సీట్లలో పోటీ చేస్తుంది. కేసీఆర్ చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. ఆయన కూతురు కవితను జైలు నుంచి విడిపించుకోవాలన్నా, కొల్లగొట్టి దాచుకున్న డబ్బును తిరిగి ప్రభుత్వం రికవరీ చేయకుండా ఉండాలన్నా, ధరణి పేరుతో లాక్కున్న పేదల ఆస్తులు వారివద్దే ఉండాలన్నా కేంద్ర ప్రభుత్వం అండ ఉండాలి. బీజేపీతో చేసుకున్న మీ లోపాయికారి ఒప్పందం ఫైనలైంది. మొదటినుంచి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లు బీజేపీ, బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలు.

అన్ని హామీలు అమలుచేస్తాం..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి మూడు నెలల్లోనే ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలను అమలు చేస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడిన గంటల వ్యవధిలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సదుపాయం కల్పిస్తున్నాం. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ 500లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నాం. రాష్ట్ర విభజన కంటే ముందు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదల కలలను నిజం చేస్తూ ప్రతీ ఊళ్లో కావాల్సినన్ని ఇందిరమ్మ ఇళ్ల నిర్మించారు. అదే పద్ధతిలో తెలంగాణలో కూడా మొదటి సంవత్సరం 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పూనుకున్నాం.

ప్రతీ నియోజకవర్గానికి 3500 చొప్పున మొదటి దశలో కేటాయించాం. రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏ ఊరికి వెళ్లినా అక్కడ పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందజేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. రైతన్నలందరికీ అగస్టు 15 లోపల రెండు లక్షల రుణమాఫీతో పాటు, రైతు బీమా అందజేస్తాం. పండించిన పంటకు గిట్టుబాటు ధర అమలు చేస్తాం. ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు కోడ్ కంటే ముందుగా 31వేల ఉద్యోగాలు ఇచ్చాం. మిగిలినవాటిని కూడా టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. విద్య, వైద్యం పట్ల కూడా ప్రత్యేక విధివిధానాలతో ముందుకు సాగుతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి ద్వారా సామాన్యుల భూములు కొల్లగొట్టింది. వాటినీ సవరిస్తాం.

ఆ ఇంటిమీది కాకి..

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో ఒక కర్ర పట్టుకుని ఖమ్మం జడ్పీ సెంటర్‌లో తమ పార్టీ అభ్యర్థి గెలిస్తే కేంద్ర మంత్రి అవుతాడని చెబుతున్నాడు. అనేక వేదికల మీద మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, నేనూ చెప్పాను.. అయ్యా కేసీఆర్.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని నామ నాగేశ్వరరావు గెలిస్తే మంత్రి చేస్తావని అడిగాం. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ విషయంలో స్పష్టంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇంటిమీది కాకి.. కాంగ్రెస్ పార్టీ ఇంటిమీద వాలితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ కాకిని తుపాకీతో కాల్చి చంపుతారని చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమిలోకి రానివ్వబోం అని స్పష్టంగా చెప్పాం. మీకున్న అవకాశం బీజేపీ.. ఆ పార్టీతోనే లోపాయికారి ఒప్పందంతో ఉన్నారు.

కావాలనే నాపై బురద జల్లుతున్నారు..

కొంతమంది కావాలనే నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడు కాంగ్రెస్ పార్టీలో పెద్దలు ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, మా నాయకుడు రేవంత్ రెడ్డి నాకు సముచితమైన స్థానం ఇచ్చారు. చాలా గౌరవమైన, ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు. ఈ పార్టీలో చాలా కంఫర్ట్ ఉన్నప్పుడు ఇంకొక పార్టీలోకి వెళ్లి, ఇంకో పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. అభూత కల్పనలు సృష్టిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వారి ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులే బయటకు వస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. వారిని వారు కాపాడుకునేందుకు డైలమాలో ఈ మాటలు మాట్లాడుతున్నారు.

ఈ ప్రభుత్వాన్ని కూలుస్తామని..

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే ఆరు నెలల్లో కూల్చుతామని, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కొందరు తమతో టచ్‌లో ఉన్నారని చెబుతున్నారు. దమ్మూ ధైర్యం ఉంటే మీకు టచ్‌లో ఉన్నవారి పేర్లు ప్రకటించాలి. ప్రభుత్వాన్ని కూల్చడం మీతరం కాదు. ఇది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. మీరు టచ్ చేసి చూడండి.. దానికి ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూపిస్తాం. కేంద్ర ప్రభుత్వమా.. ఇక్కడ ప్రతిపక్షమా అప్పుడు ప్రజలే తేలుస్తారు. 14 నుంచి 15 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలువబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా రాదు. ఎంఐఎం, బీజేపీలు మిగతా సీట్లు పంచుకుంటాయి.

అందరం ఆశించింది కరెక్టే..

మనుషులన్న తర్వాత కొన్ని కోరికలుండటం సహజం. అందులో కొన్ని సాధ్యపడుతాయి. కొన్ని సాధ్యపడకపోవచ్చు. ఏది సాధ్యపడుతుందో దానితో తృప్తి పడితే మనకు ఆనందముంటుంది. అదే ఫార్ములాతో, అదే ఫిలాసఫీతో ముందుకుసాగుతున్నా. ఖమ్మం పార్లమెంట్ సీటు కోసం నేను, మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల టికెట్ ఆశించిన విషయం వాస్తవమే. కానీ పార్టీ నిర్ణయమే ఫైనల్. ఎవరిని ఎంపిక చేస్తే వారిని మనస్సాక్షిగా గెలిపించుకోవాలనుకున్నాం. అదే విధంగా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మా మధ్య ఎలాంటి పొరపొచ్చలు లేవు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏ విధంగా తీసుకువచ్చారో.. దేశంలో కూడా రాహుల్ గాంధీని ప్రధానిని చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందరం కష్టపడి పనిచేస్తున్నాం.

కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఖమ్మం..

ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట. అది ఎంత స్ట్రాంగో తెలియందికాదు. నా 12 సంవత్సరాల ఈ రాజకీయ జీవితంలో అధికారంలో ఉన్నా.. అధికారంలో లేకపోయినా ప్రజలతో మమేకమై సత్సంబంధాలు కలిగి ఉన్నా. మారుమూల ప్రాంతాల్లో సైతం అక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆ కుటుంబ సభ్యునిగా ఉన్నా. ఒక్కసారైనా శ్రీనన్నకు ఓటు వేయాలని ఆ ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. సీపీఐ, సీపీఎం, తెలుగుతమ్ముళ్లు, సీపీఐ ఎంఎల్, టీజేఎస్, జనసేన మద్దతుతో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తున్నాడు. గడిచిన నాలుగు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరే ఈ ఎన్నికలకు గీటురాయి. ప్రజల దీవెనలతో, ప్రజల ఆశీస్సులతో ఖమ్మం అభ్యర్థి రామసహాయం రఘురామ్ రెడ్డి భారీ మెజార్టీతో గెలువడం ఖాయం.

Next Story

Most Viewed