డొనాల్డ్ ట్రంపుకే నా ఓటు: రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ

by samatah |
డొనాల్డ్ ట్రంపుకే నా ఓటు: రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంపుకే ఓటు వేస్తానని రిపబ్లికన్ పార్టీ నేత, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ తెలిపారు. వాషింగ్టన్‌లోని హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా హేలీ మాట్లాడారు. ట్రంపు అనుసరిస్తున్న విధానాలు సరిగా లేవని, ఈ విషయం చాలా సార్లు బహిరంగంగా వెల్లడించినట్టు తెలిపారు. కానీ బైడెన్ ఒక విపత్తు లాంటి వారని, కాబట్టి ట్రంపుకే ఓటు వేస్తానని స్పష్టం చేశారు. ట్రంపు చాలా తెలివైన వ్యక్తి అని కొనియాడారు. బైడెన్ విదేశాంగ విధానం సరిగా లేదని విమర్శించారు. అంతకుముందు అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న నిక్కీ హేలీ ప్రచార సమయంలో ట్రంపుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో హేలీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ట్రంప్‌కు పోటీ ఇచ్చిన నిక్కీ హేలీ పోటీలో వెనకబడంతో అధ్యక్ష రేసు నుంచి విరమించుకున్నారు. గత మార్చిలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష నామినేషన్ కోసం తన బిడ్‌ను ఉపసంహరించుకున్నప్పటికీ, ఆమె పేరు బ్యాలెట్‌లో అలాగే ఉంది. అప్పటి నుంచి ఆమె ప్రచారం చేయనప్పటికీ 10 శాతం కంటే ఎక్కువ ఓట్లను గెలుచుకుంది. ట్రంప్‌పై అసంతృప్తిగా ఉన్న చాలామంది రిపబ్లికన్లు, స్వతంత్రులు హేలీకి ఓటు వేశారు. తనకు ఓటేసిన ప్రజలకు హేలీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంపులు మరోసారి అధ్యక్ష రేసులో ఉన్నారు.

Next Story

Most Viewed