కేసీఆర్ ప్రసంగంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ అటాక్

by Ramesh Goud |   (  Updated:2025-04-27 16:17:44  IST  )

కేసీఆర్ మనసంతా విషాన్ని నింపుకొని కాంగ్రెస్ పార్టీని విలన్ గా చూపించే ప్రయత్నం చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ ప్రసంగంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ అటాక్
X

దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్ మనసంతా విషాన్ని నింపుకొని కాంగ్రెస్ పార్టీని విలన్ గా చూపించే ప్రయత్నం చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ వ్యాఖ్యలపై మీడియాతో స్పందించిన ఆయన.. బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 15 నెలల్లోనే ఆనాటి ముఖ్యమంత్రి చలవ వల్ల అప్పుల్లో ఉన్నా.. అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. అలాగే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందుకు విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా..?, హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఇచ్చినందుకు విలన్ గా చిత్రీకరిస్తున్నారా? అని మండిపడ్డారు.

తెలంగాణ వచ్చిన తర్వాత సోనియాగాంధీని దేవత అంటూ.. మీ కుటుంబం అంతా సోనియాగాంధీకి సాష్టాంగ నమస్కారం చేసిన విషయం మర్చిపోయి కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్మడం బాధగా అనిపించిందని అన్నారు. అంతేగాక తెలంగాణ ప్రజల కోసం ఆవేదన చెందుతున్నట్లు కేసీఆర్ మాట్లాడిన తీరు చూస్తుంటే నవ్వు కూడా వచ్చిందన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ను నమ్మి ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఎలా కొల్లగొట్టారో ప్రజలు గమణించారని, దానికి నిదర్శనం సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ అపార అనుభవం, 80 వేల పుస్తకాలు చదివిన జ్ఞానంతో మంచి సలహాలు ఇస్తారనుకుంటే.. 15 నెలల్లో కేవలం రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారని అన్నారు.

ప్రజలను పట్టించుకోకుండా ఫాంహౌజ్ కే పరిమితమైన మీ పాలనకు నేనే ప్రత్యక్ష సాక్ష్యం అని, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నిత్యం ప్రజల్లో ఉంటూ అందిస్తున్న పాలనను ఓర్వలేక మనసంతా విషాన్ని నింపుకొని ఉద్దేశపూర్వకంగా దుమ్మెత్తిపోశారని దుయ్యబట్టారు. ఇంకా కేసీఆర్ రైతులపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారని, ఆనాడు వరి వేస్తే ఉరే అని ప్రజలకు చెప్పి, ఆయన ఫాంహౌజ్ లో 150 ఎకరాల్లో వరి వేసుకున్నారని విమర్శించారు. ఆయన పంట క్వింటాల్ రూ. 4 వేలకు అమ్ముకొని, రైతులను పస్తులుంచి పరోక్షంగా ఉరి వేసుకొమ్మని చెప్పారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తున్నారని చెబుతున్నారు.. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.80 వేల కోట్ల బిల్లులను చెల్లించకుండా ఇందిరమ్మ ప్రభుత్వం భారం వేసి వెళ్లిపోయారని తెలిపారు.

అలాగే సర్పంచుల ఆందోళనల గురించి మాట్లాడారని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నాటికి ఒక్క సర్పంచ్ కూడా అధికారంలో లేడని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క సర్పంచ్ కూడా అభివృద్ధి పనులు చేపట్టలేదని తెలిపారు. పెండింగ్ బిల్లులతో సర్పంచులు ఇబ్బంది పడుతున్నది బీఆర్ఎస్ ప్రభుత్వ పుణ్యమేనని మంత్రి వెల్లడించారు. ఇక చివరగా కేసీఆర్ ను రెండు ప్రశ్నలు అడుగుతామని, ఉద్యమ పార్టీగా మొదలై ప్రాంతీయ పార్టీగా అవతరించి, జాతీయ పార్టీ మీరు సర్టిఫికేట్ ఇచ్చుకున్న బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి ఏ జాతీయ పార్టీకి లెనంతా డబ్బు రూ.15 వందల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఏం వ్యాపారం చేశారని మీ కుటుంబసభ్యులకు వేలాది కోట్లు ఆస్తులు వచ్చాయని నిలదీశారు.

గురిగింజ కింద నలుపు గుర్తించకుండా కాంగ్రెస్ పార్టీ మీద గుడ్డ కాల్చి వేయడం భావ్యం కాదని, శరీరమంతా విషాన్ని నింపుకొని మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని అన్నారు. సభకు అడ్డంకులు సృష్టించారని అంటున్నారని, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ సభకు వాహానాలకు పర్మిషన్ ఇవ్వలేదన్న సంగతి మర్చిపోయారా అంటూ.. ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో ఒక్క బస్సులకే కాదు.. అన్ని వాహనాలకు పర్మిషన్ ఇచ్చామని చెప్పారు. డైరీలో రాసుకొండి అని పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ చేసి మొగుడు పెళ్లాలు.. అన్నదమ్ముల మాటలు విన్న మీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కుందా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బీఆర్ఎస్ పథకం ఒక్కటైనా రద్దయ్యిందా చెప్పాలని పొంగులేటి వ్యాఖ్యానించారు.

Next Story