- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండో విడత ఇందిరమ్మ ఇండ్లలో వారికే ప్రాధాన్యత.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. గుడిసెల్లో నివసిస్తున్న అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేసిన తర్వాతే ఇతర దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. గుడిసెల్లో నివసిస్తున్న అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేసిన తర్వాతే ఇతర దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. బుధవారం హౌసింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత అమలు, గుడిసెల గుర్తింపు, రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకం, అసంపూర్తి గృహాల వివరాల సేకరణ తదితర అంశాలపై మంత్రి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్క నిరుపేద కుటుంబం సైతం గుడిసెల్లో జీవించకుండా.. సురక్షితమైన సొంత ఇంటిలో గౌరవప్రదంగా జీవించేలా చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నదని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి గ్రామం, వార్డు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గుడిసెలను యుద్ధప్రాతిపదికన గుర్తించేందుకు సమగ్ర సర్వే చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం వద్ద ఇప్పటికే ఉన్న సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి, వాస్తవ పరిస్థితులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 75 వేల మంది తాము గుడిసెల్లో నివసిస్తున్నామని దరఖాస్తు చేసుకున్నారని.. ఆ దరఖాస్తులన్నింటినీ ప్రత్యక్షంగా పరిశీలించి నిజమైన అర్హులను గుర్తించాలన్నారు. ఎంపీడీవో స్థాయిలో జాబితాలను సిద్ధం చేసి సంబంధిత ఇన్‌చార్జి మంత్రుల ఆమోదానికి పంపించాలని సూచించారు. గుడిసెల్లో నివసిస్తూ గతంలో ప్రజాపాలన లేదా ఇతర కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకోని నిరుపేద కుటుంబాలు ఇప్పుడు కూడా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అటువంటి దరఖాస్తులను సైతం క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు.
రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లు..
రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2వేల ఇళ్ల చొప్పున మంజూరు చేసిన నేపథ్యంలో అర్హుల ఎంపికను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పేదల నివాస భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. రెండో విడతలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఇళ్లను ఈ పథకం కింద ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. గోడలు, పునాదులు బలంగా ఉన్నప్పటికీ పైకప్పులు టార్పాలిన్ షీట్లు, రేకులు, నాపరాళ్లు లేదా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పైకప్పుల కింద నివసిస్తూ ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను గుర్తించి వారికి ఆర్‌సీసీ స్లాబ్ నిర్మాణం కోసం రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. గతంలో వివిధ గృహ నిర్మాణ పథకాల కింద మంజూరై ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న ఇళ్లను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించాలని ఆదేశించారు. పాత ఇందిరమ్మ పథకం కింద మంజూరై బేస్మెంట్ స్థాయి లేదా పైకప్పు స్థాయిలో నిలిచిపోయిన ఇళ్లను సైతం ఈ పథకంలో చేర్చవచ్చని పేర్కొన్నారు. అలాగే.. గృహలక్ష్మి పథకం కింద నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయిన గృహాలను సైతం గుర్తించి రూఫ్ అప్‌గ్రేడేషన్ కార్యక్రమం ద్వారా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.






