- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నియోజకవర్గానికో 500 ఇండ్లు.. క్యూర్‌లో లక్ష ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం: మంత్రి పొంగులేటి
పేదల సొంతింటి కలను సాకారం చేస్తూనే.. వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు అత్యంత సమీపంలోనే క్యూర్ పరిధిలో పది అంతస్తుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పేదల సొంతింటి కలను సాకారం చేస్తూనే.. వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు అత్యంత సమీపంలోనే క్యూర్ పరిధిలో పది అంతస్తుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. గురువారం సెక్రెటేరియట్‌లో క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పేదల ఉపాధి, పిల్లల చదువు, కుటుంబ జీవన వ్యవస్థ దెబ్బతినకుండా నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకొని వారు నివశిస్తున్న ప్రాంతాలలోనే వారికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ఏడాది క్యూర్ పరిధిలో లక్ష ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని.. ప్రయోగాత్మకంగా తొలి విడతలో ప్రతీ నియోజకవర్గానికి 500 చొప్పున ఇళ్లు నిర్మించనున్నామని తెలిపారు. క్యూర్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో ఇప్పటికే దాదాపు 20 వరకు స్థలాలను గుర్తించామని.. మిగిలిన ప్రాంతాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి ఈ నెల 28వ తేదీలోగా అన్ని లొకేషన్లను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి స్థలానికి సంబంధించిన ప్రణాళికలు, డిజైన్లు, నిర్మాణ నమూనాలను కూడా 28లోగా సిద్ధం చేయాలని సూచించారు.
ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన విధివిధానాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వివరాలతో కూడిన బ్రోచర్‌ను జూలై మొదటి వారంలో విడుదల చేస్తామని వెల్లడించారు. క్యూర్ పరిధిలో అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల్లో ఇండ్ల నిర్మాణాలను చేపడుతున్నామని.. ఈ స్థలాల్లో అన్ డివైడెడ్ షేర్ కింద మహిళలకు వాటా కల్పిస్తూ ఆ భాగాన్ని మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒకే మోడల్‌లో ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. భవనాల మరమ్మతులకు సంబంధించి హౌసింగ్ ఏఈలు భవనాలను విజిట్ చేసి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డీఎస్ లోకేశ్‌కుమార్, హౌసింగ్ శాఖ కార్యదర్శి వీపీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.






