- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిజిస్ట్రేషన్ల రద్దీకి చెక్.. ఇబ్బంది లేకుండా చర్యలు
రాష్ట్రంలో భూముల విలువలను వాస్తవ మార్కెట్ ధరలకు అనుగుణంగా క్రమబద్ధీకరించాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయంతో రిజిస్ట్రేషన్లకు భారీగా డిమాండ్ పెరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భూముల విలువలను వాస్తవ మార్కెట్ ధరలకు అనుగుణంగా క్రమబద్ధీకరించాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయంతో రిజిస్ట్రేషన్లకు భారీగా డిమాండ్ పెరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 29వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు పని వేళలను ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి రాకూడదని, ఎవరూ ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ధ్యేయమని, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వేగం, పారదర్శకత, సౌకర్యం మూడు ప్రధాన లక్ష్యాలు అని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్లాట్ బుకింగ్‌ల సంఖ్యను కూడా పెంచాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని అవసరమైతే అదనపు సమయంతో పాటు మరిన్ని రోజులు కూడా పని వేళలను పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగే తహశీల్దార్ కార్యాలయాలతో సమన్వయం పెంచాలని, ఎక్కడా ఆలస్యం లేకుండా సేవలు అందించాలన్నారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, సౌకర్యవంతమైన సేవలు అందించడంలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని రిజిస్ట్రేషన్ల ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతుకు మంత్రి పొంగులేటి సూచించారు.






