యువరాజుకు నో చాన్స్.. సీఎంగా కేటీఆర్‌కు అవకాశం లేనట్లే!

by Disha Web Desk 2 |
యువరాజుకు నో చాన్స్.. సీఎంగా కేటీఆర్‌కు అవకాశం లేనట్లే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ 'గ్రాండ్'ఎంట్రీ ఖాయమంటూ టీఆర్ఎస్ నాయకులు సంకేతాలిచ్చారు. అదే సమయంలో కేటీఆర్‌కు ముఖ్యమంత్రి అవకాశం ఉండకపోవచ్చనే అంశంపైనా క్లారిటీ వచ్చింది. కేసీఆర్ రాష్ట్ర పరిధి దాటి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా సీఎంగానూ కంటిన్యూ అవుతారంటూ బలంగా నొక్కిచెప్పారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం దాదాపుగా ఖాయమైన పరిస్థితుల్లో రాష్ట్ర బాధ్యతలను కేటీఆర్‌కు అప్పజెప్పే అవకాశాలున్నాయంటూ ఇంతకాలం పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు 'కాబోయే సీఎం కేటీఆర్..' అంటూ పలు వేదికల మీద 2021లోనే నినాదాలు చేశారు. కేటీఆర్ కూడా దీనిని ఖండించలేదు. చివరకు ఇది కేసీఆర్ దృష్టికి వెళ్లింది. స్వయంగా ఆయనే 2021 ఫిబ్రవరి 8న తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ప్రస్తావించారు. "ఇంకో పదేళ్ల పాటు నేనే సీఎంగా ఉంటాను. ఎలాంటి అనుమానం లేదు.

సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. సీఎంగా పనిచేసే శక్తి కూడా ఉన్నది. ముఖ్యమంత్రి పోస్టులో మార్పు ఉంటుందనే ఊహాగానాలు వద్దు. ఎవరైనా రిపీట్ చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. నన్ను రాజీనామా చేయాలంటున్నారా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లటం కోసం సీఎం కేసీఆర్ గతేడాది చివరి నుంచే కసరత్తు మొదలుపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మరింత ముమ్మరమైంది. సీఎం హోదాలోనే పలు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ముఖ్యమంత్రులను, ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిసి నేషనల్ పాలిటిక్స్ పైనా, ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాపైనా చర్చించారు. బీజేపీయేతర పార్టీలతో పాటు కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్న ప్రాంతీయ పార్టీలతోనూ చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటేనే జాతీయ స్థాయి రాజకీయాలపై వివిధ రాష్ట్రాల్లో గొంతెత్తినప్పుడే దాని ప్రభావం ఉంటుందని కేసీఆర్ భావించారు. జాతీయ పార్టీ వ్యాప్తి కూడా వేగంగా, బలంగా వివిధ రాష్ట్రాలకు విస్తరించగలుగుతామని భావించారు.

ధ్రువీకరించిన అధికార పత్రిక

ఇప్పుడు సరిగ్గా ఈ మాటలనే ఆ పార్టీకి చెందిన నేతలు అనుకూల పత్రిక ద్వారా నొక్కిచెప్పారు. జాతీయ రాజకీయాల్లోకి ఎంటర్ అయినా ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగడం ఖాయమనే స్పష్టతను కూడా ఇచ్చారు. దీంతో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ఊహాగానాలకు బ్రేక్ పడినట్లయింది. సాధారణ ఎన్నికల్లో జాతీయ పార్టీ ప్రభావాన్ని వివిధ రాష్ట్రాల్లో చూపించాలని కేసీఆర్ భావిస్తున్నందున అప్పటివరకూ (2024 మే) కేటీఆర్‌కు సీఎం బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు లేకుండాపోయాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఇప్పుడు కొనసాగుతున్నా డీఫ్యాక్టో సీఎంగా కేటీఆరే వ్యవహరిస్తున్నారన్నది ఆ పార్టీ నాయకుల కామెంట్. పలు శాఖల మంత్రులు, విభాగాల కార్యదర్శులతో సీఎం తరహాలోనే కేటీఆర్ రివ్యూలు కూడా నిర్వహిస్తున్నారు. కానీ అనుకూల పత్రిక కథనంతో కేటీఆర్ ఆశల మీద నీళ్ళు చల్లినట్లయింది. మొదటి టర్ములో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగినా రెండో టర్ములో మాత్రం ఏదో ఒక సందర్భంలో కేటీఆర్‌కు పగ్గాలు అప్పజెప్పడం ఖాయమని ఆ పార్టీ నాయకులు చాలా మంది భావించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రమోషన్ ఇవ్వడంతో పాలనలోనూ అలాంటి అవకాశం వస్తుందన్న ఊహాగానాలు వినిపించాయి.

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ బిజీగా ఉండాల్సి వచ్చినా సీఎం బాధ్యతలను మాత్రం వదులుకునే అవకాశం లేదని స్పష్టమవుతున్నది. ప్రస్తుతం డీఫ్యాక్టో సీఎంగా కొనసాగుతున్న తరహాలోనే కేటీఆర్ ఇకపైన కూడా కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవైపు కుటుంబ పాలన అంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి విమర్శలు వస్తున్న సమయంలో కేటీఆర్‌కు పగ్గాలు అప్పజెప్పడం మరిన్ని విమర్శలకు దారితీస్తుందనే వాదన టీఆర్ఎస్‌లో లేకపోలేదు. సీఎం బాధ్యతలను కేటీఆర్‌కు అప్పజెప్పనున్నట్లు వచ్చిన ఊహాగానాలకు బ్రేక్ వేసేలా ప్లీనరీలో, అసెంబ్లీ సమావేశాల్లో సైతం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే మంత్రి కేటీఆర్ సైతం ఇటీవల మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా "దక్షిణాదిలోనే సీఎం కేసీఆర్ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు" అని కామెంట్ చేశారు. సీఎం అయ్యే అవకాశం లేదనే అభిప్రాయానికి వచ్చారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల నేపథ్యంలో మరోసారి రూఢీ అయినట్లయింది.

Also Read : కేసీఆర్ జాతీయ పార్టీలో కవితకు చోటు?


Also Read : టీఆర్ఎస్‌తో పొత్తుపై సీపీఐ కొత్త కార్యదర్శి కూనంనేని కీలక వ్యాఖ్యలు (వీడియో)


Also Read : రేవంత్‌కు చుక్కెదురే.. మనుగోడులో పంతం నెగ్గించుకున్న సీనియర్లు


ఇవి కూడా చ‌ద‌వండి :

ఓవర్​ స్పీడ్​ తో ప్రయాణం... కేసీఆర్​ బస్సుకు ఫైన్



Next Story

Most Viewed