ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కిన KTR.. ఈసీ చెప్పిన డోంట్ కేర్..!

by Satheesh |   (  Updated:2023-11-29 13:02:50  IST  )

బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ‘దీక్షా దివాస్’ను నిర్వహించవద్దని, కేవలం పార్టీ ఆఫీసులోనే జరుపుకోవాలని ఎలాంటి

ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కిన KTR.. ఈసీ చెప్పిన డోంట్ కేర్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ‘దీక్షా దివాస్’ను నిర్వహించవద్దని, కేవలం పార్టీ ఆఫీసులోనే జరుపుకోవాలని ఎలాంటి కామెంట్లు కూడా చేయవద్దని, కనీసం తెలంగాణ భవన్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి సైతం పూలమాల వేయవద్దని ఎలక్షన్ కమిషన్ స్వ్కార్డ్ టీం సూచించింది. కేవలం రక్తదాన శిబిరంను మాత్రం నిర్వహించుకోవాలని సూచించింది. ఓటర్లను ప్రభావం చేసే ఏ కార్యక్రమం చేయొద్దని పేర్కొంది. అయితే మంత్రి కేటీఆర్ రక్తదాన శిబిరం ప్రారంభించి రక్తదానం చేశారు. అనంతరం తెలంగాణ భవన్‌లోనే మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. ఏయే జిల్లాల్లో ఎన్ని సీట్లు గెలుస్తామని చెప్పడంతోపాటు మూడోసారి అధికారంలోకి వస్తున్నామని చెప్పారు. గోషామహల్, కామారెడ్డి, హుజూరాబాద్, ములుగులో గెలుస్తున్నామని స్పష్టం చేశారు. రేవంత్‌ను ‘నువ్వు ముఖ్యమంత్రి ఎట్లవుతావు అంటే గుంపు మేస్ట్రీ అంటుండు.. ఇట్లాంటి బేవకూఫ్ గాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారంటా’ అంటూ మండిపడ్డారు. కరోనా అనేది తెలవకుండా వస్తుంది.. తెలిసి తెచ్చుకుందాం అనుకుంటే అది కాంగ్రెస్ వైరస్ అవుతుంది. కరోనాకు వ్యాక్సిన్ ఉంది, కాంగ్రెస్‌కు వ్యాక్సిన్ లేదు అని అన్నారు. ఆ తర్వాత కేసీఆర్ దీక్ష పరిణామాలను వివరించారు.

కేటీఆర్‌పై సీఈవోకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేసింది. కేటీఆర్ దీక్ష దివాస్ నిర్వహించడం ఓటర్లను ప్రభావితం చేయడమేనని, ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని కాంగ్రెస్ నేత నిరంజన్ బుధవారం సీఈవోకు ఫిర్యాదు చేశారు. దీక్ష దివాస్‌కు సంబంధించి కేటీఆర్ చేసిన ప్రకటన మీడియాలో కూడా వచ్చిందని, దీక్ష దివస్ పేరుతో బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ రక్తదాన చేసిన విషయాన్ని నిరంజన్ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. కాగా ఇప్పటికే ఇరు పార్టీల మధ్య ఎన్నికల సంఘానికి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీక్ష దివాస్ పేరుతో కేటీఆర్ కోడ్ ఉల్లంఘించారని ఆరోపించడం హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్పటికే టీవర్క్స్‌లో నిరుద్యోగులతో సమావేశంపై ఈసీ సీరియస్

రాయదుర్గంలోని టీవర్క్స్‌లో నిరుద్యోగులతో మంత్రి కేటీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి చెందిన ప్రాంగణాన్ని రాజకీయ వేదికగా వాడుకోవడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఇచ్చిన నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. ఆఫీసును రాజకీయ అవసరాలకు వినియోగించుకున్నట్లు రంగారెడ్డి జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి కూడా ధృవీకరించినందున నిర్దిష్ట కారణాలను పేర్కొంటూ వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీనికి వివరణ ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. అయితే మళ్లీ దీక్షా దివాస్‌ను పురస్కరించుకొని రక్తదాన శిబిరంలో పాల్గొన్న అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని కాంగ్రెస్ నాయకులు బుధవారం సీఈసీకి ఫిర్యాదు చేశారు.

Next Story