వారికి బీసీల‌పై ప్రేమ ఉండే అవ‌కాశమే లేదు.. మంత్రి కొండా సురేఖ‌ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

తెలంగాణలో బీసీ రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో కేంద్రం మోసం చేస్తే ఊరుకునేది లేద‌ని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) హెచ్చరించారు.

వారికి బీసీల‌పై ప్రేమ ఉండే అవ‌కాశమే లేదు.. మంత్రి కొండా సురేఖ‌ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బీసీ రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో కేంద్రం మోసం చేస్తే ఊరుకునేది లేద‌ని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) హెచ్చరించారు. ఒక బీసీ మంత్రిగా.. బీసీ బిడ్డగా.. ఈ విష‌యంలో క‌ప‌ట వైఖ‌రిని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అవ‌లంభిస్తే.. తాము ప్రజ‌ల్లో ఎండ‌గ‌డ‌తామ‌ని మంత్రి సురేఖ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మంత్రులు పొన్నం ప్రభాక‌ర్‌, వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్‌లతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. బీసీ బిల్లును తాము అసెంబ్లీలో ప్రవేశ‌పెట్టి.. కేంద్రానికి పంపిస్తే.. బీజేపీ దాన్ని ఆపింద‌ని.. ఇది సరైంది కాద‌న్నారు. ప్రస్తుతం బీసీ రిజ‌ర్వేష‌న్ బిల్లు రాష్ట్రపతి దగ్గర ఉందని చెప్పారు.

అయితే, దాన్ని ఒప్పుకుంటారా? లేదో రాష్ట్ర ప్రజ‌ల‌కు బీజేపీ(BJP), కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాల‌ని సురేఖ డిమాండ్ చేశారు. బీసీల‌ను మోసం చేసే కార్యక్రమాలు చేయోద్దని బీజేపీని ఆమె హెచ్చరించారు. కాగా, త‌మ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతవ‌ర్గానికి చెందిన నాయ‌కుడైనా.. ఆయా వ‌ర్గాల‌ను ఒప్పించి బీసీ హ‌క్కులను కాపాడేందుకు చ‌ర్యలు తీసుకున్నట్టు వివ‌రించారు. ఈ దేశంలో ద‌ళితులు, గిరిజ‌నుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేన‌ని అన్నారు. గ‌తంలో ఉమ్మడి రాష్ట్రంలోని కూడా తాము ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్ ఇచ్చామ‌ని గుర్తుచేశారు. ఇప్పుడు బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇస్తున్నది కూడా మేమే అని మంత్రి సురేఖ‌ వివ‌రించారు.

స‌మాజంలో వెన‌క‌బ‌డిన వ‌ర్గాలు, నిమ్నవ‌ర్గాల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఎప్పుడూ ముందు ఉంటుంద‌ని చెప్పారు. నిన్న(గురువారం) దేశ రాజ‌ధాని ఢిల్లీకి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, బీసీ మంత్రులతో పాటు నిపుణుల కమిటీ.. ఖర్గే, రాహుల్ గాంధీలతో భేటీ జ‌రిగింద‌ని గుర్తుచేశారు. ఈ భేటీలో తెలంగాణ ప్రభుత్వం చేప‌ట్టిన కుల‌గ‌ణ‌న‌పై కాంగ్రెస్ అగ్రనాయ‌క‌త్వం పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసిన‌ట్టు వివ‌రించారు. ఇక‌, బీఆర్ఎస్ బీసీ కుల‌గ‌ణ‌న‌లో అస‌లే పాల్గొన‌లేద‌ని.. వారికి బీసీల‌పై ప్రేమ ఉండే అవ‌కాశం లేద‌ని మంత్రి విమ‌ర్శించారు. ఇప్పటికైనా బీసీల‌పై బీజేపీ, బీఆర్ఎస్ ద్వంద వైఖ‌రి వీడాల‌ని.. సామాజిక న్యాయం కోసం కృషి చేయాల‌ని ఆ రెండు పార్టీల నేత‌ల‌కు సూచించారు.

Next Story