తెలంగాణ ఆత్మగౌర‌వ ప్రతీక‌ స‌మ్మక్క సార‌క్క జాత‌ర‌

by Naga Rani Yarlagadda |

స‌మ్మక్క- సార‌క్క మేడారం జాత‌ర తెలంగాణ ఆత్మగౌర‌వ ప్రతీక అని రాష్ట్ర దేవాదాయ, అటవీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.

తెలంగాణ ఆత్మగౌర‌వ ప్రతీక‌ స‌మ్మక్క సార‌క్క జాత‌ర‌
X
  • ఎక్కడా లోటుపాట్లు లేకుండా నిర్మాణాలు చేప‌ట్టాలి
  • రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ
  • సచివాలయంలో భ‌క్తుల క్యూలైన్ల బ్రాస్ గ్రిల్స్ నమూనాను ప‌రిశీలించిన మంత్రి

దిశ, తెలంగాణ బ్యూరో : స‌మ్మక్క- సార‌క్క మేడారం జాత‌ర తెలంగాణ ఆత్మగౌర‌వ ప్రతీక అని రాష్ట్ర దేవాదాయ, అటవీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఈ జాత‌ర వేదిక... ప్రపంచం న‌లుమూలలూ చాటిచెప్పే గొప్ప ఆథ్యాత్మిక కేంద్రంగా మేడారం విల‌సిల్లుతుంద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. స‌మ్మక్క- సారల‌మ్మ పోరాట గాథ‌, చరిత్ర విశ్వవ్యాప్తమవుతున్నద‌ని చెప్పారు. సమ్మక్క సారక్క మేడారం జాత‌రలో అమ్మవారి గద్దెల చుట్టూ భ‌క్తులు క్యూలైన్లలో సాఫీగా వెళ్ళేందుకు త‌యారు అవుతున్న బ్రాస్ గ్రిల్స్ నమూనాను సెక్రటేరియ‌ట్‌లో శ‌నివారం మంత్రి పరిశీలించారు. గిరిపుత్రుల ఆరాధ్య దేవ‌తల ఆశీస్సులు తీసుకునేందుకు... మొక్కులు చెల్లించుకునేందుకు... ఆ ప్రాంతాన్ని సంద‌ర్శించి త‌న్మయ‌త్వం చెంది పునీతుల‌య్యేందుకు కోట్లలో భ‌క్తులు జాతరకు వ‌స్తార‌ని, అందుకు త‌గిన విధంగా బ్రాస్ గ్రిల్స్ నాణ్యమైన‌వి ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న మేర‌కు మేడారంలో పెద్ద ఎత్తున శాశ్వత ప‌నులు చేప‌డుతున్నామ‌న్నారు. దాదాపు రెండు వంద‌ల ఏండ్ల పాటు మ‌న్నికగా ఉండే ఉద్దేశంతో ఈ గ్రిల్స్ ను పటిష్టంగా త‌యారు చేయించిన‌ట్టు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మంత్రికి తెలిపారు. వీటిని స‌మ్మక్క సార‌క్క, జంప‌న్న గ‌ద్దెల చుట్టూ ఏర్పాటు చేయ‌నున్నాన్నారు. ఈ గ్రిల్స్ ను గ‌ద్దెల వద్దనున్న గ్రనైట్స్ కి సుమారు ఆరు మీట‌ర్ల లోతులో నిల‌బెట్టనున్నట్లు వివరించారు. ఏర్పాట్ల విష‌యంలో ఏ విధంగానూ రాజీ ప‌డొద్దని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. మేడారం జాతర ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింద్ననారు. మేడారం జాతరలో భక్తుల రద్దీ నిర్వహణను మెరుగుపరచేందుకు చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు. భక్తుల భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జాత‌ర‌కు మూడు నెల‌ల ముందు నుంచే ప‌క‌డ్బందీ ప్రణాళిక‌తో ముందుకు పోతున్నామ‌ని చెప్పారు.

Next Story