మీకు ఏ ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాం.. ఆదివాసీలకు మంత్రి కొండా సురేఖ భరోసా

by Gantepaka Srikanth |

జీవో 49 మీద ఆదివాసీలు, గిరిజ‌నుల‌కు ఎటువంటి ఆందోళ‌న వ‌ద్దని.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడ‌వి బిడ్డల‌కు ఎప్పుడూ అండ‌గా ఉంటుందని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) భరోసా ఇచ్చారు.

మీకు ఏ ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాం.. ఆదివాసీలకు మంత్రి కొండా సురేఖ భరోసా
X

దిశ, వెబ్‌డెస్క్: జీవో 49 మీద ఆదివాసీలు, గిరిజ‌నుల‌కు ఎటువంటి ఆందోళ‌న వ‌ద్దని.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడ‌వి బిడ్డల‌కు ఎప్పుడూ అండ‌గా ఉంటుందని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) భరోసా ఇచ్చారు. ఆదిలాబాద్ ఇంచార్జీ మంత్రి జూప‌ల్లి, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి సీత‌క్క స‌మిష్టిగా నిర్ణయం తీసుకొని రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి నివేదించ‌గా.. ఆయ‌న ఆదేశాల మేర‌కు సోమ‌వారం జీవో 49ను అబేయ‌న్స్‌లో పెడుతూ అట‌వీశాఖ ఉన్న‌తాధికారులు ఉత్త‌ర్వులు జారీ చేశారు.

జీవో 49 మీద స్థానిక ఆదివాసీల్లో అనుమానాలు, అభ్యంత‌రాలు నెల‌కొన్న నేప‌థ్యంలో వాటిపై ప‌లు ద‌ఫాలు మంత్రులు కొండా సురేఖ, జూప‌ల్లి కృష్ణారావు, సీత‌క్క భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అట‌వీ శాఖ అధికారులు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులతో మంత్రులు స‌మావేశాలు నిర్వ‌హించి, స‌మ‌గ్ర వివ‌రాలు సేక‌రించారు. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో స్థానిక క‌లెక్ట‌ర్ నుంచి మ‌రొక‌సారి నివేదిక తెప్పించుకున్న ప్ర‌భుత్వం... ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ది. పులుల కారిడార్‌ కవ్వాల్‌ అభయారణ్యంలో భాగంగా ఉన్న ఆసిఫాబాద్‌ ప్రాంతాన్ని కుమురంభీం పులుల కన్జర్వేషన్‌ రిజర్వుగా మారుస్తూ గత నెల 30న అటవీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అహ్మద్‌ నదీమ్‌ జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే.

జిల్లాలోని ఆసిఫాబాద్‌, కెరమెరి, రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్‌, సిర్పూర్‌, కర్జెల్లి, బెజ్జూర్‌, పెంచికల్‌పేట్‌ రేంజ్‌లలో లక్ష 49 వేల హెక్టార్లను టైగర్‌ రిజర్వులోకి మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. జీవో విడుదల కోసం 330 ప్రభావిత గ్రామాల ప్రజల్లో నెలకొన్న అనుమానాలా నివృత్తి చేసేందుకు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో మంత్రులు స‌మ‌గ్ర వివ‌రాలు సేక‌రించారు. స్థానిక ఆదివాసీల విజ్ఞ‌ప్తి మేర‌కు... సీఎం రేవంత్ రెడ్డికి ఈ విష‌యాన్ని నివేదించి.. అబేయ‌న్స్‌లో పెట్టాల‌ని ప్ర‌భుత్వం ముంద‌డుగు వేసింది. అయితే, రానున్న రోజుల్లో కూడా ఆదివాసీల‌కు ఇబ్బందుల‌కు రాకుండా చూసుకుంటామ‌ని అట‌వీ శాఖ మంత్రి కొండా సురేఖ హామీనిచ్చారు. త‌మ ప్ర‌భుత్వానికి ప్ర‌జా సంక్షేమ‌మే ధ్యేయం అని వ్యాఖ్యానించారు.

Next Story