- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఎంతటి వారైనా ఊరుకునేది లేదు’.. పీసీబీ అధికారులపై మంత్రి ఆగ్రహం
రాష్ట్రంలోని పర్యావరణాన్ని పరిరక్షించే ప్రక్రియలో ఫార్మా, డ్రగ్ కంపెనీలు.. ప్రమాణాలు పాటించాలని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని పర్యావరణాన్ని పరిరక్షించే ప్రక్రియలో ఫార్మా, డ్రగ్ కంపెనీలు.. ప్రమాణాలు పాటించాలని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) స్పష్టం చేశారు. బుధవారం సెక్రటేరియట్‌లో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫార్మా, బల్క్ డ్రగ్ పరిశ్రమల అనుమతుల విషయంలో అవకతవకలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ముందు ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను మంత్రికి పీసీబీ అధికారులు వివరించారు. సీపీసీబీ(సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు)కి అందిన ఫిర్యాదుల వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో సెక్రటేరియట్‌లో బుధవారం ఫారెస్టు మినిస్టర్ ఛాంబర్‌లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.
అనుమతులు లేని, అనుమతుల టైం అయిపోయిన కంపెనీలను ఎన్నిసార్లు రైడ్స్ చేశారో.. స్థానికంగా గ్రౌండ్ వాటర్ కలుషితం అవుతున్న స్టేటస్ చెక్ చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. గ్రౌండ్ వాటర్ కలుషితం అయిన ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ నుండి డ్రైవ్ చేపించారా? అంటూ మంత్రి ప్రశ్నలు వేశారు. ఎంతటి వారైనా పర్యావరణ పరిరక్షణ ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని అధికారులకు స్పష్టం చేశారు. అవసరం అయితే ప్రభుత్వం తరఫున టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఆ టాస్క్ ఫోర్స్ కమిటీలో ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎన్విరాన్మెంటల్ పరిరక్షకులు, సెంట్రల్ పిసిబి అధికారులు కూడా ఇందులో చేర్చి ఉన్నత స్థాయి కమిటీని వేస్తామని స్పష్టం చేశారు.
అయితే, ప్రతి ఆరు నెలలకి ఒకసారి ఇన్‌స్పెక్షన్ చేస్తున్నట్టు మంత్రి సురేఖకి పీసీబీ మెంబర్ సెక్రటరీ జి. రవి వివరించారు. కంప్యూటరైజ్డ్ ఇన్‌స్సెక్షన్ ప్రక్రియ కూడా చేపడుతున్నట్టు వెల్లడించారు. జనావాసాలున్న చోట ఫార్మా, బల్క్ డ్రగ్ కంపెనీలు వాటిని స్థానచలనం చేసేందుకు కసరత్తు చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఔటర్ రింగు రోడ్డు అవతలనే ఫార్మా కంపెనీలుండాలని చెప్పారని.. ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పలు ఫార్మా, బల్క్ డ్రగ్ కంపెనీల ప్రతినిధులు మంత్రికి వివరించారు. నీటి కలుషితం కాకుండా ఉండేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో మంత్రికి తెలిపారు. నీటి కలుషితం కావొద్దని.. భావి తరాలకు నీటి వనరులను అందజేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని మంత్రి సురేఖ సూచన చేశారు. పొల్యూషన్ కంట్రోల్ ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని.. అందుకు సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. అయితే, చాలా ముఖ్యమైన సమావేశానికి కొన్ని కంపెనీ ప్రతినిధులు రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇంతటి ముఖ్యమైన సమావేశానికి ఆయా కంపెనీలు వారి సంస్థల్లోని చిన్న చితకా ఉద్యోగులను పంపడం సరికాదన్నారు.
పర్యావరణ శాఖ మంత్రి అనే ఛైర్‌కి గౌరవం ఇవ్వాల్సి అనివార్యత ఉందన్న విషయం గుర్తించాలన్నారు. ఆ విషయాన్ని సదరు కంపెనీల ప్రతినిధులు తెలుసుకోవాలన్నారు. కంపెనీలకు అనుమతుల్లో ఉదాశీనత సరికాదని పీసీబీ అధికారులను హెచ్చరించారు. ఎక్కడైనా ఇష్టారీతిన వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు. చౌటుప్పల్ ఏరియా నుంచి పర్యావరణ పరిరక్షణ, నీటి కలుషితం మీద విపరీతమైన ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వాటిపై చాలా కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. పర్యావరణ చట్టాల మేరకు పీసీబీకి, రాష్ట్ర ప్రభుత్వంకు అన్ని అధికారులున్నాయన్న విషయం మరిచిపోవద్దన్నారు. నిబంధనలు, ప్రమాణాల మేరకు చర్యలు తీసుకుంటనే పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్నారు. నీటి కలుషితం కూడా తగ్గుతుందని వివరించారు. రెయిన్ వాటర్ ను కలుషితం చేయకూడదన్నారు. గాలి కలుషితం చర్యలు సాధ్యమైనంత తగ్గించాలన్నారు. కలుషితం జరిగి మానవ ఇబ్బందులు జరిగే కంటే ముందు నివారిస్తే మంచిదని మంత్రి పరిశ్రమ ప్రతినిధులు, పీసీబీ అధికారులకు హితవు పలికారు. కరోనా తర్వాత చిన్న చిన్న విషయాలకే మరణాలు సంభవిస్తున్నాయని... అయితే, కరోనా తర్వాత పర్యావరణ పరిరక్షణ మరింత కీలకమైందన్నారు. సిగాచి ఘటన తర్వాత కంపెనీల్లో మరింత భద్రత అవసరమన్న విషయం గుర్తించాలన్నారు. తమ కంపెనీల్లో ఏది ఎలా ఉందో వారికే బాగా తెలుసు అని గుర్తు చేశారు. అందుచేత, సెల్ఫ్ ఇన్స్‌పెక్షన్ చేసుకోవాలన్నారు. పీసీబీ తరఫున కూడా రైడ్స్ జరుగుతాయని అన్నారు.






