కరెంట్ చార్జీల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-05-31 12:49:27  IST  )

రైతు డిస్కంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను మంత్రి కోమటిరెడ్డి ఖండించారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే సమయంలో బీజేపీ నేతలు బస్సు యాత్రలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

కరెంట్ చార్జీల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైతులకు స్మార్ట్ మీటర్ల ఆరోపణలపై బీఆర్ఎస్‍ చేస్తున్న విమర్శల పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మోటర్లకు మీటర్లు పెట్టబోమని ఒకవేళ పెడితే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న మొత్తం 119 సీట్లలో కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉండి బీఆర్ఎస్ అభ్యర్థులే ఏకగ్రీవం అయ్యేలా చూస్తామన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ కోసం సబ్ స్టేషన్లు పెంచుకుంటూ వెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో కరెంట్ బిల్లులు పెంచబోమన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని మీ పార్టీ పని ఖతం అయిపోయిందన్నారు. కవిత ఓ వైపు వెళ్లిపోయారని రేపు బావ మరో వైపు వెళ్లబోతున్నాడని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఫామ్ హౌస్‍కే పరిమితం అయ్యారని విమర్శించారు.

బీజేపీ నేతలకు పాలాభిషేకాలు:

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే టైమ్ లో బీజేపీ బస్సు యాత్రలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. బీజేపీ నేతలు బస్సు యాత్రలు కాదు ఢిల్లీ యాత్రలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేలా బీజేపీ నేతలు బస్సులో వెళ్తారా లేదా పాదయాత్రగా వెళ్తారో వారిష్టం. ఢిల్లీకి వెళ్లి ఒప్పించాలన్నారు. నడక ఆరోగ్యానికి మంచిదేనని పాదయాత్రగా వెళ్లి మోడీని కలిసి రావాలన్నారు. ధాన్యం కొనేలా మోడీని ఒప్పిస్తే బీజేపీ నేతలకు ఊరూరా పాలాభిషేకం చేయిస్తామన్నారు. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన ఓ న్యూస్ చానల్‍తో బీజేపీని తెలంగాణలో నమ్మె పరిస్థితి లేదన్నారు. ప్రజల్లో ఎంతో పాపులారిటీ ఉన్నప్పటికీ పార్టీ ఆదేశంతో తన పదవిని త్యాగం చేసిన సిద్ధరామయ్య చేతులెత్తి మొక్కుతున్నానన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న డీకే శివకుమార్ కు అభినందనలు తెలిపారు.

Next Story