- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోక్‌సభ స్పీకర్ ఎదుట మంత్రి కోమటిరెడ్డి కీలక డిమాండ్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును భారత్-పాక్ విభజనతో పోల్చడాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం ఏదో అకస్మాత్తుగా జరిగింది కాదని, అది ఒక సుదీర్ఘ పోరాట ఫలితమని మంత్రి గుర్తు చేశారు. "రాజ్యాంగంలోని 3వ అధికరణం ప్రకారం, శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ ఏర్పడింది. ఇది కోట్లాది మంది ప్రజల చిరకాల ఆకాంక్షలు, అమరవీరుల త్యాగాల ప్రతిరూపం" అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తేజస్వి సూర్య చేసిన పోలికలు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన సభలో ఉండి రాష్ట్ర గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అని ఆయన ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. ఈ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తేజస్వి సూర్య వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే, నిండు సభలో రాష్ట్రాన్ని కించపరిచిన సదరు ఎంపీపై లోక్‌సభ స్పీకర్ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.






