ఏపీలో రాజకీయం వేరు.. తెలంగాణలో వేరు: మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-11 16:00:13  IST  )

‘ఎస్ఎల్‌బీసీ కోసం వైఎస్ఆర్‌తో కొట్లాడాను. ఫాంహౌస్‌లో కూర్చొని కేసీఆర్ ఫ్యామిలీ కుటుంబం ఏం క్షుద్రపూజలు చేసిందో ఎస్ఎల్‌బీసీ కూలిపోయింది’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో రాజకీయం వేరు.. తెలంగాణలో వేరు: మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఎస్ఎల్‌బీసీ కోసం వైఎస్ఆర్‌తో కొట్లాడాను. ఫాంహౌస్‌లో కూర్చొని కేసీఆర్ ఫ్యామిలీ కుటుంబం ఏం క్షుద్రపూజలు చేసిందో ఎస్ఎల్‌బీసీ కూలిపోయింది’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మంత్రి మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రికి షాబాద్‌లో 80 ఎకరాల ఫాంహౌస్ ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్ అగ్రనేతల బినామీలు ఫోన్ ఎత్తడం లేదని.. ఆ పార్టీలో వాళ్లకు వాళ్లే కొట్టుకుంటున్నారని అన్నారు. తాను ఏడుసార్లు పోటీచేసి ఆరుసార్లు గెలిచానని.. తన అఫిడవిట్‌లో ఎలాంటి తప్పులూ లేవని స్పష్టం చేశారు. ఏపీలో రాజకీయం వేరని.. తెలంగాణలో వేరని.. ఏపీని చూసి తెలంగాణలో అరెస్టులు ఉంటాయని అనుకోవద్దని చెప్పారు. జస్టిస్ పీసీ ఘోష్ మొదటి లోక్‌పాల్‌గా పనిచేశారని తెలిపారు. తమపైన ఇతర దేశాల నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారని.. మూడు లక్షల జీతం ఉన్న అధికారి థాయిలాండ్‌లో పెళ్లి చేశారంటే ఎంత ఓపెన్‌గా అవినీతి జరిగిందో అర్థం అవుతుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన ఇంజినీర్ల వద్ద రూ.50 నుంచి రూ.60వేల కోట్లు ఉన్నాయని ఆరోపించారు. అధికారుల వద్ద అంత డబ్బులు ఉంటే లీడర్ల వద్ద ఎంత ఉంటాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఒక్కో ఆఫీసర్‌ను పట్టుకుంటే వందలు, వేల కోట్లు పట్టుబడుతున్నాయని అన్నారు. తాము రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటంలేదని.. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చిస్తామని వెల్లడించారు. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు.

ఆర్ఆర్ఆర్‌కు 96 శాతం భూసేకరణ పూర్తి

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పూర్తి సహకారం అందిస్తున్నారని.. ఏ పార్టీ వారు అపాయింట్మెంట్ అడగినా ఇస్తున్నారని కోమటిరెడ్డి చెప్పారు. చింతల్ టూ హయత్‌నగర్ డబుల్ డెక్కర్ రోడ్డు మంజూరు చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఆర్అండ్‌బీ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఢిల్లీ ఎక్కడ ఉందో కూడా తెలియదని.. అధికారులు తెలియదు ఎవరూ తెలియదని ఎద్దేవా చేశారు. సెక్రెటేరియట్ కట్టి రూ.350 కోట్ల బకాయిలు తమ మీద పెట్టారని ఆరోపించారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి 96శాతం భూసేకరణ పూర్తిచేశామని.. భూసేకరణకు ఆరువేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. ఒక్క రీజినల్ రింగ్ రోడ్డుపైన 20 నుంచి 30 మీటింగ్స్ పెట్టామని వెల్లడించారు. హైదరాబాద్‌కు రీజినల్ రింగ్ రోడ్డుతో సినిమా షూటింగ్స్ హబ్‌గా మారుతుందన్నారు. అభివృద్ధిలో హైదరాబాద్ తర్వాత నల్లగొండను చేస్తామని.. హైదరాబాద్‌లో ఐటీసీ కోహినూర్ హోటల్ ముందు ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాంటిదే అక్కడా నిర్మిస్తున్నామని చెప్పారు. పదేళ్ల క్రితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందేదని అన్నారు.

ఫిల్మ్ ఫెడరేషన్‌లో మరోసారి చర్చలు

ఫిల్మ్ ఫెడరేషన్ వారితో నేడు మరోసారి మాట్లాడతామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. దేశంలో అత్యధికంగా టాలీవుడ్‌లోనే సినీ కార్మికులకు వేతనాలు ఇస్తున్నారని చెప్పారు. పెద్ద, పెద్ద సినిమాలు తక్కువ ఉన్నాయని.. చిన్న సినిమాలు ప్రస్తుతం ఎక్కువ షూటింగ్స్ నడుస్తున్నాయని వెల్లడించారు.

Next Story