- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో రూ.60,799 కోట్ల రోడ్ల నిర్మాణం.. మన్ననూరు నుంచి శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్.. మరెన్నో
రూ.60,799 వేల కోట్లతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర అభివృద్ధి కోసం, జీడీపీ పెరుగుదలే లక్ష్యంగా, ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి రూ.60,799 వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) తెలిపారు. వీటితో పాటు రూ.28 వేల కోట్లతో చేపట్టనున్న మన్ననూర్- శ్రీశైలం హైవే, ఫ్యూచర్ సిటీ- బందరు పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు ప్రతిపాదన దశలో ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు రోడ్లకు సంబంధించిన కీలక సమాచారంతో మంత్రి శనివారం మీడియాకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మౌలిక సదుపాయాల కల్పనతో బహుళజాతి సంస్థలకు తెలంగాణ కేంద్రంగా మారబోతోందన్నారు. ప్రపంచంలోని పెట్టుబడిదారులు అంతా తెలంగాణ రాష్ట్రానికి తరలివచ్చేలా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. అత్భుతమైన రహదారుల నిర్మాణంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు వచ్చి పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉందన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని, లక్షలాదిమంది గ్రామీణ యువతకు ఉపాధి కలగనుందని తెలిపారు.
అబ్దుల్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్- విజయవాడ వరకు (హైదరాబాద్- విజయవాడ హైవే) జాతీయ రహదారిని 8 లైన్ల రహదారిగా విస్తరిస్తామని అన్నారు. ఇందులో ఆరు లైన్లు ప్రధాన రహదారి కాగా.. రెండు సర్వీస్ రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. రహదారి వెంట ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజల సౌకర్యార్థం, రోడ్డు ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.10,400 ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గతిని మార్చే రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణానికి రూ.36 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆరు లైన్లుగా నిర్మించబోతున్న ఆర్ఆర్ఆర్ ఎక్కువ జిల్లాలను కలుపుతుందని వివరించారు. ఈ రహదారి నిర్మాణానికి 50 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. రహదారులు లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్లు, సింగిల్ రోడ్డు ఉన్నచోట డబుల్ రోడ్లు నిర్మించేందుకు హ్యామ్ ప్రాజెక్టుకు రూ.11,399 కోట్లతో కొద్ది రోజుల్లో టెండర్లు పిలుస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని రహదారుల నిర్మాణానికి అనుమతులు ఇస్తామన్నారు. వీటితో పాటుగా అదనంగా మరో 28 వేల కోట్లతో చేపట్టనున్న పనులు ప్రతిపాదనలో ఉన్నాయని మంత్రి వెంకటరెడ్డి తెలిపారు.
రూ. 8వేల కోట్లతో శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్..
రూ. 8వేల కోట్లతో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 52 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు తుది దశకు చేరాయని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేను రూ.20 వేల కోట్లతో నిర్మించనున్నామన్నారు. ఈ రహదారి నిర్మాణంతో రాష్ట్ర ముఖచిత్రమే మారుతుందని భావిస్తున్నామన్నారు. భవిష్యత్తులో రహదారులపై ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఊహించని విధంగా రహదారుల నిర్మాణానికి అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ పనులకు సంబంధించి ప్రతి 15 రోజులకు ఒకసారి సీఎం, డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారని గుర్తుచేశారు. ఢిల్లీ వెళ్లిన ప్రతి సందర్భంలోనూ సీఎం రేవంత్ రెడ్డి రహదారులకు సంబంధించిన అంశాలపై సంబంధిత కేంద్ర మంత్రులను కలిసి ఒత్తిడి తీసుకురావడం మూలంగా రహదారుల విషయంలో గొప్ప ప్రగతి కనిపించిందన్నారు.






