ఇకనుంచి నల్లగొండలో ప్రజాదర్బారు నిర్వహిస్తా: మంత్రి కోమటిరెడ్డి

by Gantepaka Srikanth |

నల్లగొండ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే నల్లగొండ అని మరోసారి రుజువైందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

ఇకనుంచి నల్లగొండలో ప్రజాదర్బారు నిర్వహిస్తా: మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే నల్లగొండ అని మరోసారి రుజువైందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్లగొండ కార్పొరేషన్‌ను కైవసం చేసుకున్న అనంతరం క్లాక్‌టవర్ సెంటర్‌లో మంత్రి కోమటిరెడ్డి(Minister Komatireddy Venkat Reddy) మీడియాతో మాట్లాడారు. నల్లగొండ కార్పొరేషన్‌(Nalgonda Corporation)పై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మున్సిపాల్టీల్లో సత్తా చాటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పరంపర కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. బీఆర్ఎస్ ఓటమి ఒప్పుకొని.. ఆత్మ విమర్శ చేసుకోవాలి. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కార ఎజెండాగా మా పాలన కొనసాగుతుంది. ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాదుకు దీటుగా అభివృద్ధి చేస్తా

నల్లగొండ కార్పొరేషన్‌ను హైదరాబాదుకు దీటుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. గెలుపొందిన అభ్యర్థులంతా అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలిపారు. ఎన్నికలలో గెలుపోటములు సహజమని అన్నారు. ఓడిపోయినా అధైర్య పడకుండా డివిజన్లో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని అన్నారు. వారానికి రెండు రోజులు నల్లగొండలోనే ఉండి పేదోళ్ల కష్టాలు, సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తానని పేర్కొన్నారు. ఇకనుంచి ప్రతి డివిజన్లో ప్రజా దర్బారు నిర్వహిస్తానని వెల్లడించారు.

ఈ సందర్భంగా గెలుపొందిన పార్టీ అభ్యర్థులందరికీ విషెస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాశం రామ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, కార్పొరేటర్లు ఇటికాల మంగమ్మ శ్రీనివాస్, మారగొని నవీన్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Next Story