విద్యార్థిని భవితకు అండగా మంత్రి కోమటిరెడ్డి

by Naga Rani Yarlagadda |

నగరానికి చెందిన భవిత అనే విద్యార్థిని కుటుంబ ఆర్ధిక ఇబ్బందులతో స్కూల్ ఫీజు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న విషయం స్థానికంగా ఓ యూట్యూబర్ ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.

విద్యార్థిని భవితకు అండగా మంత్రి కోమటిరెడ్డి
X
  • యూట్యూబ్ వీడియో చూసి చలించిన మంత్రి
  • ఫీజు బకాయిల పేరిట మెరిట్ స్టూడెంట్ కు సర్టిఫికెట్లు ఇవ్వని స్కూల్ యాజమాన్యం
  • ఫీజు కట్టి సర్టిఫికెట్లు ఇప్పించిన మంత్రి

దిశ, తెలంగాణ బ్యూరో: నగరానికి చెందిన భవిత అనే విద్యార్థిని కుటుంబ ఆర్ధిక ఇబ్బందులతో స్కూల్ ఫీజు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న విషయం స్థానికంగా ఓ యూట్యూబర్ ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. బోడుప్పల్ లోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతిలో 600కు గాను 582 మార్కులు సాధించి స్కూల్ టాపర్ గా నిలిచిన విద్యార్థిని భవితకు స్కూల్ ఫీజు డ్యూ పేరిట యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వలేదంటూ విద్యార్థిని వాపోయింది. ఆ వీడియో సోషల్ మీడియా ద్వారా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి వచ్చింది. వెంటనే విషయంపై ఆరా తీసిన మంత్రి తన కార్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. విద్యార్థిని భవిత తల్లి దండ్రులు వెంకన్న- దేవకి వ్యాపారంలో నష్టపోయి తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారని, విద్యార్థిని స్కూల్ ఫీజు చెల్లించలేని దీన స్థితిలో ఉన్నారని తెలిసింది. వెంటనే స్కూల్ ప్రిన్సిపల్ తో స్వయంగా ఫోన్లో మాట్లాడిన మంత్రి.. విద్యార్థిని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో మినిస్టర్స్ క్వార్టర్స్ శనివారం ఉదయం 10గంటల లోపు రావాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో స్కూల్ ప్రిన్సిపల్ సర్టిఫికెట్స్ తీసుకొని రాగా.. అప్పటికే మినిస్టర్స్ క్వార్టర్స్ చేరుకున్న విద్యార్థిని భవితతో మంత్రి ఆప్యాయంగా ముచ్చటించారు.

కుటుంబ ఆర్ధిక ఇబ్బందులు తల్లి దండ్రుల దీన పరిస్థితి గురించి తెలుసుకొని మంత్రి చలించిపోయారు. భవిష్యత్ చదువుల గురించి ఆరా తీయగా.. 10వ తరగతిలో 582 సాధించి స్కూల్ టాపర్ గా నిలిచానని, పాలిసెట్ లో స్టేట్ 634వ ర్యాంక్ సాధించానని, డిప్లొమా చేసి, తర్వాత ఇంజనీరింగ్ చదువుతానని భవిత మంత్రితో తన ఫ్యూచర్ ప్లానింగ్స్ చెప్పింది. ఈ పరిస్థితిలో ఉండి ఇంత టాలెంట్ ఉన్న అమ్మాయికి స్కూల్ ఎందుకు సహకారం అందించలేదు అని మంత్రి స్కూల్ ప్రిన్సిపల్ ను సున్నితంగా మందలించారు. అక్కడికక్కడే స్కూల్ ఫీజు రూ.60వేలు చెల్లించి, సర్టిఫికెట్స్ తీసుకుని విద్యార్థినికి అందజేశారు. పాలిసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ లాస్ట్ డేట్ అని తెలుసుకుని అందుకు ఏర్పాట్లు చేయాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థిని భవిత ఖర్చుల నిమిత్తం తక్షణ సాయం కింద రూ.20వేలు అందజేశారు. భవిష్యత్ లో ఉన్నత చదువులకు అండగా ఉంటానని భవితకు మనోధైర్యం చెప్పి, భరోసా కల్పించారు. ల్యాప్ టాప్ కావాలన్నా.. ఏ అవసరం ఉన్న తనను సంప్రదించాలని విద్యార్థిని భవితకు సూచించి ఆల్ ది బెస్ట్ చెప్పారు. తాను వీడియో చూడకుంటే విద్యార్థిని పరిస్థితి ఏంటి అని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేసే మంచి గుణం ఉన్న ప్రతి ఒక్కరు దేవునితో సమానమని అక్కడికి వచ్చిన వారికి హితబోధ చేశారు. సాటి మనిషికి ఆపద వచ్చినపుడు స్పందించి సాయం చేసిన వారు తన దృష్టిలో దేవునిగా భావిస్తానని అన్నారు. ఎవరికి తోచిన సాయం వారు అవసరం ఉన్న వారికి చేయాలని సూచించారు.

మంత్రి కోమటి రెడ్డి సాయాన్ని ఎన్నడూ మర్చిపోలేమన్న విద్యార్థిని

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని విద్యార్థిని భవిత, కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. శనివారం పాలిసెట్ స్లాట్ బుకింగ్ లాస్ట్ డేట్ అని తెలిసి, ఉదయమే పిలిపించి వెరిఫికేషన్ లో పాల్గొనే విధంగా సర్టిఫికెట్స్ అందించి మంత్రి తన మంచి మనసు చాటుకున్నారని అన్నారు. మంత్రి మనసున్న నాయకుడని... ఆయన రుణం తీర్చుకోలేనిదని వారు పేర్కొన్నారు.

Next Story