నాకు తెలియకుండానే అఖండ-2 జీవో.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

అఖండ2 సినిమా టికెట్ల పెంపు జీవో వ్యవహారం రాజకీయ దుమారంగా మారింది.

నాకు తెలియకుండానే అఖండ-2 జీవో.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన 'అఖండ-2: తాండవం' (Akhanda 2) మూవీ టికెట్ల ధరల పెంపు, ప్రీమియర్ షోల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ సినిమా టికెట్ల ధరల పెంపుపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) తీవ్రంగా స్పందించారు. తనకు తెలియకుండానే టికెట్ల ధరలపెంపుకు సంబంధించిన జీవో విడుదలైందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. టికెట్ల రేట్లు పెంచొద్దని గతంలోనే అనుకున్నామని ఈ విషయాన్ని అసెంబ్లీలోనే చెప్పామన్నారు. కానీ ఈసారి పొరపాటు జరిగిందన్నారు. ఇవాళ ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన మంత్రి.. గత రాత్రే హోం సెక్రటరీతో తాను మాట్లాడానని ఇకపై టికెట్ల ధరల పెంపు, ప్రీమియర్ షోల విషయంలో ఎలాంటి అప్లికేషన్లు తీసుకోవద్దని, నా దృష్టికి తీసుకురాకుండా ఎవరూ ధరలను పెంచవద్దని ఆదేశాలు ఇచ్చానన్నారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సైతం తీసుకువెళ్లామన్నారు.

ఇకపై సినిమా టికెట్ల ధరలు పెంచేది లేదని నిర్మాతలు, డైరెక్టర్లు ఎవరూ టికెట్ల ధరలు పెంచాలని మా వద్దకు రావొద్దన్నారు. కుటుంబం సినిమాలు చూడాలంటే టికెట్ల ధరలు తగ్గాలని అన్నారు. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం పేదల కోసమే మా నిర్ణయాలు ఉంటాన్నారు. హీరోలకు వందల కోట్ల రెమ్యూనరేషన్లు ఎవరు ఇవ్వమన్నారని ప్రశ్నించారు. అయితే అఖండ-2 సినిమా టికెట్ల ధరలు పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతి ఇస్తు తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే ఈ జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా దీనిపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. సింగిల్ బెంచ్ తీర్పుపై చిత్ర నిర్మాణ సంస్థ డివిజన్ బెంచ్‍కు అప్పీల్ చేసుకుంది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఈనెల 14 వరకు స్టే విధిస్తూ తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేసింది.

Next Story