పర్యాటక రంగానికి డిజిటల్ బూస్టర్

by velandi.Saikiran |   (  Updated:2026-05-21 15:30:29  IST  )

తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశం’లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు.

పర్యాటక రంగానికి డిజిటల్ బూస్టర్
X

పర్యాటక రంగానికి డిజిటల్ బూస్టర్

ఇన్ఫ్లుయెన్సర్లు ప‌ర్యాట‌క ప్ర‌మోష‌న్ తో పాటు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలి

డ్రగ్స్, బెట్టింగ్‌, ఆన్‌లైన్ గేమ్స్‌పై యువతకు చైతన్యం కల్పించాలి

త్వరలో ప్రభాత భేరి సామాజిక చైతన్య కార్యక్రమం

ఉత్తమ టూరిజం క్రియేటర్లకు అవార్డులు, ప్రోత్సాహకాలు

‘తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశం’లో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

దిశ, తెలంగాణ బ్యూరో: పర్యాటక రంగం కేవలం విహార యాత్రలకే పరిమితం కాదు.. అది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, యువతకు ఉపాధికి, తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌కు శక్తివంతమైన సాధనం అని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. డిజిటల్ వేదికల ద్వారా తెలంగాణ ప్రకృతి అందాలు, చారిత్రక వైభవం, సంస్కృతి సంపదను ప్రపంచానికి చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణను వేగవంతం చేసిన‌ రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక రంగానికి కొత్త ఊపునివ్వడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు. పర్యాటక వారోత్సవాల సందర్భంగా బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన ‘తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశం’లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. .

పర్యాటకంతో ఉపాధి.. రాష్ట్రానికి ఆదాయం

పర్యాటక ప్రాంతాల ప్రోత్సాహంతో స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయాన్ని వైద్య, ఆరోగ్య, విద్యా రంగాల బలోపేతానికి, పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగిస్తామని చెప్పారు. “మన ప్రాంతాలను మనమే చూడకపోతే జీవితం సంపూర్ణం కాదు” అని పేర్కొన్న ఆయన తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఆర్థిక స్థోమత అడ్డంకి కాదన్నారు. అనవసర ఖర్చులను తగ్గించుకుని కుటుంబంతో కలిసి పర్యాటక ప్రాంతాల్లో గడపడం వల్ల మానసిక ప్రశాంతత, ఆనందం లభిస్తాయని సూచించారు.

సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కేవలం ప‌ర్యాట‌క ప్రమోషన్‌కే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని మంత్రి జూపల్లి సూచించారు. యువత.. గంజాయికి, డ్ర‌గ్స్, ఇత‌ర మ‌త్తు ప‌దార్థాలు, బెట్టింగ్‌కు, ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వీటితో మానసిక రుగ్మతకు గురై బంగారు భవిష్యత్తును కొల్పోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సామాజిక, మాన‌సిక‌ రుగ్మ‌త‌లను రూపుమాపేందుకు ఇన్ప్లు యెన్స‌ర్లు తమ కంటెంట్ ద్వారా సామాజిక చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం ప్ర‌భాత భేరి అనే స‌రికొత్త సామాజిక చైత‌న్య కార్యక్ర‌మాన్ని త్వ‌ర‌లో ప్రారంభించ‌బోతుంద‌ని, ల‌ఘు చిత్రాలు, నాటిక‌లు, రంగ‌స్థ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌లు, వివిధ క‌ళా రూపాల ద్వారా ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు కార్య‌చ‌ర‌ణను అమ‌లు చేయ‌బోతున్నామ‌ని ప్ర‌క‌టించారు.

తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి చాటండి

తెలంగాణ సంస్కృతి, వారసత్వం, ఆతిథ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో క్రియేటర్లు భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగస్వాములయ్యే కంటెంట్ క్రియేటర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఉత్తమ ప్రతిభ కనబరిచే టూరిజం క్రియేటర్లకు ప్రభుత్వం తరఫున అవార్డులు, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తామని మంత్రి జూపల్లి ప్రకటించారు.

నూతన మెటా ఖాతా ఆవిష్కరణ

ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ నూతన మెటా ఖాతా, అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను మంత్రి జూపల్లి ఆవిష్కరించారు. తెలంగాణ చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, హస్తకళలు, చేనేత, కలంకారీ కళా వైభవాన్ని ప్రతిబింబించే టైమ్‌లెస్ తెలంగాణ వీడియోను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్, ఎండీ గౌతమి, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, నిథమ్ డైరెక్టర్ వెంకట రమణ, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి తదితరులు పాల్గొన్నారు.

Next Story