- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ కేసుల విషయంలో నేనూ బాధితుడినే: మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు
ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల విషయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు ద్వంద్వ నీతిని అవలంబిస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల విషయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు ద్వంద్వ నీతిని అవలంబిస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వమే గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి జీవోలు ఇచ్చి, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుతగలడం సిగ్గుచేటని విమర్శించారు. శుక్రవారం సీఎల్పీలో ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 2016లో 25 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణానికి రూ.4,177 కోట్లతో జీవో ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జూపల్లి గుర్తు చేశారు. 2019 మార్చిలో గొల్లపల్లితో సహా 27 రిజర్వాయర్లను ప్రతిపాదించి, ఇప్పుడు అదే ప్రాజెక్టు వద్దని మాట్లాడటం పాలమూరు ప్రజలను వంచించడమేనన్నారు. కృష్ణా జలాల్లో 811 టీఎంసీ నీళ్లు ఉభయ రాష్ట్రాలకు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకే.. కేసీఆర్ సంతకం చేసి అన్యాయం చేశారని, శ్రీశైలంలో నీళ్లు లేని సమయంలో వాడుకోవడానికి రిజర్వాయర్లు అవసరమని గతంలో మేం మొత్తుకున్నా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
హరీశ్‌రావు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదు..
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయని హరీశ్‌రావు చెబుతున్న మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. రూ. 80 వేల కోట్ల అంచనా వ్యయం ఉన్న ప్రాజెక్టులో కేవలం రూ. 25 వేల కోట్లు ఖర్చు చేసి 80 శాతం పనులు ఎలా పూర్తి చేస్తారని నిలదీశారు. కనీసం కాలువల నిర్మాణం పూర్తి చేయలేదు, భూసేకరణ లేదు, పరిపాలనా అనుమతులు లేవు. ఎన్నికల ముందు హడావుడిగా పంపులు ఆన్ చేసి ప్రజలను వంచించారు తప్ప, ఒక్క ఎకరాకైనా నీళ్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరుపై రూ. 7 వేల కోట్లు ఖర్చు చేస్తే, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రూ. 8,300 కోట్లు వెచ్చించాయని గుర్తు చేశారు. 50 టీఎంసీల మల్లన్న సాగర్ కోసం రైతులను ఈడ్చి పారేసి ప్రాజెక్టు కట్టిన హరీశ్‌రావుకు పాలమూరు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి, దోసుకోవడానికే గత ప్రభుత్వం ప్రాజెక్టులను వాడుకుందని ధ్వజమెత్తారు. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కంపెనీ చేపట్టిన కల్వకుర్తి ప్యాకేజీ 29 పనులు నేటికీ పూర్తి కాలేదన్నారు. పాలమూరు ప్రాజెక్టులపై తాము ఎక్కడైనా చర్చకు సిద్ధమని, హరీశ్‌రావు చర్చకు రావాలని సవాల్ విసిరారు.
పగటి కలలు కనడం మానేయండి..
గత పదేళ్లలో అక్రమ కేసులు పెట్టి ప్రజాస్వామ్యం గొంతు నొక్కారని, ఆ కేసుల విషయంలో నేనే బాధితుడినని జూపల్లి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడటం లేదని స్పష్టం చేశారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు కాబట్టే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని, కానీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.






