- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో మరో కీలక చట్టం తీసుకురాబోతున్నాం.. మంత్రి జూపల్లి ప్రకటన
రాష్ట్రంలో పనిచేస్తున్న గిగ్, ప్లాట్ ఫాం వర్కర్లకు సంక్షేమం, సామాజిక భద్రత, బీమా తదితర సదుపాయాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) త్వరలోనే నూతన చట్టాన్ని తీసుకురాబోతుందని, దేశానికే ఆదర్శంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతున్నామని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పనిచేస్తున్న గిగ్, ప్లాట్ ఫాం వర్కర్లకు సంక్షేమం, సామాజిక భద్రత, బీమా తదితర సదుపాయాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) త్వరలోనే నూతన చట్టాన్ని తీసుకురాబోతుందని, దేశానికే ఆదర్శంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతున్నామని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతోన్న భారత్ సమ్మిట్ -2025లో తెలంగాణ గిగ్ వర్కర్ల ముసాయిదా బిల్లుపై (Consultation on Telangana Gig Workers Policy and Law) చర్చా గోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, సామాజిక భద్రత, కనీస వేతనాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఫుడ్ డెలివరీ, క్యాబ్ సర్వీస్, నిత్యావసర సరుకుల రవాణా, అర్బన్ క్లాప్ వంటి సేవలతో మన నిత్య జీవితంలో భాగమైయ్యాయని అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన సందర్భంలో గిగ్ వర్కర్ల సాధికారత, సామాజిక భద్రత కోసం చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని గుర్తుచేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ముసాయిదా బిల్లును రూపొందించిందని తెలిపారు. రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకొని వాటి కంటే ఉత్తమమైన విధానాన్ని తీసుకువస్తున్నామని చెప్పారు. ముసాయిదా బిల్లును పబ్లిక్ డొమైన్‌లో పెట్టి.. విస్తృత స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నామని వివరించారు.
ముసాయిదా బిల్లుపై కార్మిక శాఖ స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా బిల్లు అద్భుతంగా ఉందని దేశీయ, అంతర్జాతీయ ప్రతినిధులు అభినందించారు. రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉందని అభిప్రాయపడ్డారు. ముసాయిదాపై పలు సూచనలు చేశారు.
ఈ చర్చా గోష్టిలో కొలంబియా, బ్రెజిల్, ఈక్వెడార్, తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు, ఏఐసీసీ బీసీ, ఎస్సీ, ఓబీసీ, మైనార్టీ, అండ్ ఆదివాసీ విభాగ కోఆర్డినేటర్, మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు, అల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫాం వర్కర్స్ యూనియన్ కార్యదర్శి షేక్ సలావుద్దీన్, మజ్దూర్ కిషన్ శక్తి సంఘటన్ ప్రతినిధులు పాల్గొన్నారు.






