- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jupally Krishna Rao: కళాసారథుల వేతనాల చెల్లింపులపై మంత్రి జూపల్లి కీలక ఆదేశాలు
మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీని సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని, దాని నిర్వహణను మరింత మెరుగుపరచాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: (Madhapur Art Gallery) మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీని సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని, దాని నిర్వహణను మరింత మెరుగుపరచాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) అధికారులను ఆదేశించారు. సోమవారం మాదాపూర్‌లోని ఆర్ట్ గ్యాలరీలో మంత్రి జూపల్లి ఆర్ట్ గ్యాలరీ, సాంస్కృతిక కళా సారథి సంస్థల అధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆర్ట్ గ్యాలరీకి మరింత ప్రాచుర్యం తీసుకురావడానికి ఒక సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. చిత్రకారులు, కళాకారులు దీనిని ఎక్కువగా సద్వినియోగం చేసుకునేలా, అలాగే కళాప్రియులు, ప్రజలు, పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శించేలా ప్రత్యేక కార్యక్రమాలు, ప్రదర్శనలు, ఈవెంట్లు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.
కళాసారథుల వేతనాల చెల్లింపులపై ఆదేశం..
సాంస్కృతిక కళాసారథుల గురించి ప్రస్తావిస్తూ, వారి వేతనాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. కళాకారుల సేవలకు గౌరవం ఇవ్వడం ప్రభుత్వ ధర్మమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అలాగే, కళా సారథి కార్యాలయంలో ఉన్న ఆడియో వీడియో స్టూడియోలో సౌండ్ ప్రూఫింగ్ పనులను తక్షణమే చేపట్టాలని, అందుకోసం అవసరమైన కన్సల్టెంట్ నిపుణుడి సేవలను వినియోగించుకోవాలని మంత్రి ఆదేశించారు. సమావేశానికి ముందు మంత్రి జూపల్లి ఆర్ట్ గ్యాలరీ, సాంస్కృతిక కళా సారథి కార్యాలయాలను స్వయంగా సందర్శించారు. ఈ సమీక్షలో ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మి, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నరసింహ రెడ్డి, సాంస్కృతిక కళాసారథి చైర్‌పర్సన్ వెన్నెల గద్దర్ పాల్గొన్నారు.






