ఈ సాయంత్రమే ప్రెస్‌క్లబ్‌కు వస్తా.. పాలమూరు పౌరుషం ఏంటో చూపిస్తా: మంత్రి జూపల్లి

by Gantepaka Srikanth |

గత బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పుల చిట్టాపై రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గులాబీ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు.

ఈ సాయంత్రమే ప్రెస్‌క్లబ్‌కు వస్తా.. పాలమూరు పౌరుషం ఏంటో చూపిస్తా: మంత్రి జూపల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పుల చిట్టాపై రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గులాబీ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పులు, బకాయిలపై తాను అన్న మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, తన ఆరోపణలు అబద్ధమని రుజువు చేస్తే మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. శుక్రవారం సీఎల్పీ మీడియా సెంటర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ అగ్రనేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అప్పులపై కేటీఆర్, హరీష్ రావులవన్నీ పూటకో మాట..

బీఆర్ఎస్ నేతల తీరు 'ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్' అన్నట్లుగా ఉందని మంత్రి జూపల్లి ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో అప్పుల లెక్కలపై కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ పూటకో రకంగా మాట్లాడారని మండిపడ్డారు. తాము చేసిన అప్పులు రూ.3.17 లక్షల కోట్లు అని ఒకసారి, రూ.3.85 లక్షల కోట్లు అని మరోసారి కేటీఆర్ చెప్పారు. హరీష్ రావు చూస్తే.. రూ.4.26 లక్షల కోట్లని ఒకసారి, రూ.4.17 లక్షల కోట్లని మరోసారి నెంబర్లు మార్చారు. అసలు వీరు అసెంబ్లీలో మాట్లాడిన దానికి కట్టుబడి ఉన్నారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో అప్పులు, బకాయిలు కలిపి అక్షరాలా రూ.8,21,651 కోట్లు చేశారని మంత్రి స్పష్టం చేశారు.

కేసీఆర్ కుటుంబానికి సీల్డ్ కవర్ లేఖలు..

అప్పుల లెక్కలపై వాస్తవాలు తేల్చడానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు తాను రాతపూర్వకంగా లేఖ రాస్తున్నట్లు మంత్రి జూపల్లి వెల్లడించారు. "ఈ లేఖను వాట్సాప్, ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా సీల్డ్ కవర్లలో పంపుతున్నా. నేను చెప్పిన లెక్కలకు కట్టుబడి రాజీనామాకు సిద్ధమయ్యా. మరి నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఏం చేస్తారో రాతపూర్వకంగా చెప్పాలి? ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారా లేక కేసీఆర్ పార్టీని రద్దు చేస్తారా? అని సవాల్ విసిరారు. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులతో మాకు సంబంధం లేదనడం బీఆర్ఎస్ నేతల సిగ్గుమాలినతనానికి నిదర్శనమన్నారు. కాళేశ్వరం, పాలమూరు, మిషన్ భగీరథ పేరుతో తెచ్చిన అప్పులను ప్రజలు, రైతుల నెత్తిన రుద్దాలని చూశారా అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

పాలమూరు పౌరుషం ఏంటో చూపిస్తా..

తనకు పదవుల కంటే ఆత్మగౌరవమే ముఖ్యమని, గతంలో ఆత్మగౌరవం కోసమే ప్రభుత్వ ఉద్యోగానికి, ఆ తర్వాత మంత్రి పదవికి కూడా రాజీనామా చేసిన చరిత్ర తనదని జూపల్లి గుర్తుచేశారు. "మిస్టర్ హరీష్ రావు, కేటీఆర్.. నాటి తెలంగాణ ఉద్యమంలో పాలమూరు " పౌరుషం, చీము, నెత్తురు ఉండబట్టి మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశాను. కేసీఆర్‌కు కుడి భుజం, ఎడమ భుజం అని చెప్పుకునే మీరు ఉమ్మడి మహబూబ్ నగర్‌లో ఒక్క సీటు కూడా గెలిపించుకోలేకపోయారు. నేను రాజీనామా చేశాకే జిల్లాలో బీఆర్ఎస్‌కు 6 సీట్లు వచ్చాయి" అని దుయ్యబట్టారు. తాను అబద్ధాలు చెప్పే వ్యక్తిని కాదని, తోకముడిచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

కూట్లో రాయి తీయలేనోడు.. ఏట్లో రాయి తీస్తాడట..

బీఆర్ఎస్ అనాలోచిత ఆర్థిక విధానాలపై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. "కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తా అన్నట్లుగా కేటీఆర్, హరీష్ రావు తీరు ఉంది. ఎన్నికల ముందు ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లీజును అడ్డగోలుగా అమ్మి. ఆ వచ్చిన డబ్బుల్లో కేవలం రూ.5,800 కోట్లు మాత్రమే రైతు బంధు కింద చెల్లించారు" అని ఆరోపించారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారని, దమ్ముంటి మీడియా ముందుకు రావాలన్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు తాను ప్రెస్‌క్లబ్‌కు వస్తున్నానని, బీఆర్ఎస్ నేతలకు దమ్ము, ధైర్యం, రోషం ఉంటే అక్కడికైనా వచ్చి చర్చలో పాల్గొనాలని, పాలమూరు పౌరుషమో.. కల్వకుంట్ల పౌరుషమో తేల్చుకుందామని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు.

Next Story