ఇవన్నీ ప్రపంచ పర్యాటకులకు పరిచయం చేద్దాం.. సహకరించండి: మంత్రి జూపల్లి

by Gantepaka Srikanth |

సెవెన్ టూంబ్స్ కటోరా హౌస్, కేబీ మ్యూజియంను ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్‌తో కలిసి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు.

ఇవన్నీ ప్రపంచ పర్యాటకులకు పరిచయం చేద్దాం.. సహకరించండి: మంత్రి జూపల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: సెవెన్ టూంబ్స్ కటోరా హౌస్, కేబీ మ్యూజియంను ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్‌తో కలిసి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. కుతుబ్ షాహీ టూంబ్స్‌లోని ఇంటర్ప్రిటేషన్ సెంటర్‌లో జరుగుతున్న పనులపై ఆరా తీశారు. వక్ఫ్ ట్రిబ్యునల్‌లో కేసు పెండింగ్ గురించి చర్చించారు. ట్రిబ్యునల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను మినహాయించి, మిగిలిన పనులను వారంలోగా ప్రారంభించి, వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కుతుబ్ షాహి టూంబ్స్ నుంచి గోల్కొండ కోట వరకు 1.3 కిలోమీటర్ల రోప్ వే నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ఏ స్థాయిలో ఉన్నాయో మంత్రి ఆరా తీశారు. పురావస్తు శాఖ, GHMC, HMDA, కులీకుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని సమన్వయం చేసుకుని, డీపీఆర్ సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. కటోరా హౌస్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. కటోరా హోస్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యర్థాలను వెనువెంటనే తొలగించాలని GHMC అధికారులను మంత్రి ఆదేశించారు. తర్వాత గోల్కొండ కోట సమీపంలోని బస్ స్టాప్ వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో లాడ్ బజార్ తరహాలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ ప్రతిపాదనలను నేషనల్ మాన్యుమెంట్ మిషన్ అథారిటీకి పంపి అనుమతులు పొందాలని సూచించారు.

అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి...

ఎంతో చారిత్రాత్మక విలువైన కళాఖండాలు ఉన్న ఖజానా బిల్డింగ్ మ్యూజియంను పర్యాటకంగా అభివృద్ధి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ఈ ప్రదేశంలో చేనేత వస్త్రాల(ఖాదీ) ప్రదర్శనను ఏర్పాటు చేయాలని పురావస్తు, టీజీటీడీసీ, QQSDA అధికారులను ఆయన ఆదేశించారు. కేబీ మ్యూజియం వెనక భాగంలో ఉన్న ఆక్రమణలను పోలీస్ శాఖ సహకారంతో వారం రోజుల్లో తొలగించాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణలో అద్భుతమైన చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉన్నాయని, వాటిని ప్రపంచ పర్యాటకులకు పరిచయం చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా వాటిని అభివృద్ధి చేయడంతో పాటు, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజీటీడీసీ ఎండీ గౌతమి, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున రావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story