క‌ర్ణాట‌క CM సిద్ధరామయ్యకు మంత్రి జూప‌ల్లి కీలక విజ్ఞప్తి

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-05 17:28:49  IST  )

క‌ర్నాట‌క‌లోని నారాయ‌ణ‌పూర్ డ్యాం నుంచి 5 టీఎంసీల‌ నీటిని విడుద‌ల చేసి ఉమ్మడి పాల‌మూరు జిల్లా సాగు, తాగునీటి అవ‌స‌రాలు తీర్చాల‌ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామ‌య్యను ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కోరారు.

క‌ర్ణాట‌క CM సిద్ధరామయ్యకు మంత్రి జూప‌ల్లి కీలక విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: క‌ర్నాట‌క‌లోని నారాయ‌ణ‌పూర్ డ్యాం నుంచి 5 టీఎంసీల‌ నీటిని విడుద‌ల చేసి ఉమ్మడి పాల‌మూరు జిల్లా సాగు, తాగునీటి అవ‌స‌రాలు తీర్చాల‌ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామ‌య్యను ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, వాకిటి శ్రీహ‌రి, గవినోళ్ల మధుసూదన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మంగ‌ళ‌వారం బెంగ‌ళూరులో సిద్ధరామయ్యను కలిసి విన‌తిప‌త్రం ఇచ్చారు. అనంత‌రం నీటి పారుద‌ల శాఖ మంత్రి డీకే శివ‌కుమార్‌ను క‌లిసి నారాయ‌ణ‌పూర్ రిజ‌ర్వాయ‌ర్ నుంచి నీటిని విడుద‌ల చేయాల‌ని కోరారు. ఉమ్మడి పాల‌మూరు జిల్లా వరప్రదాయని ప్రియ‌ద‌ర్శిని జూరాల ప్రాజెక్టు వేగంగా అడుగంటుతున్నదని, రోజురోజుకూ నిల్వలు తగ్గిపోయి నీటిమట్టం పడిపోతున్నదని వివ‌రించారు. ప్రాజెక్టులో మంగళవారం నాటికి నీటి నిల్వ 1.7 టీఎంసీలకు చేరిందని, పరిస్థితి ఇలాగే సాగితే డెడ్ స్టోరేజీకి పడిపోతుంద‌ని ఆందోళన వ్యక్తం చేశారు. పంట‌లు ఎండిపోయి లక్షలాది మంది రైతుల జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని వివ‌రించారు.

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఉమ్మడి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు వ‌ర‌ప్రదాయిని అని, జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, బీమా ప్రాజెక్ట్ వంటి ప్రధాన ప్రాజెక్టులకు నీటిని అందిస్తూ సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తున్నద‌ని తెలిపారు. ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా సుమారు 2.5 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి నీరు అందుతున్నదని, ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నీటి నిల్వల తగ్గుదల కారణంగా పంటలకు కనీసం రెండు త‌డులు ఇవ్వాల్సిన అవసరం ఉంద‌ని పేర్కొన్నారు. అలాగే.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 30 లక్షల మంది ప్రజలు తాగునీటి కోసం ఈ నీటి వనరుపైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు. గద్వాల్, వనపర్తి, కొల్లాపూర్, దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల్లో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంద‌న్నారు. సానుకూలంగా స్పందించిన డీకే శివ‌కుమార్.. 4 టీఎంసీల నీటిని విడుద‌ల చేస్తామ‌ని భ‌రోసానిచ్చిన‌ట్లు మంత్రి బృందం తెలిపింది.

Next Story