- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యపై దాడి దురదృష్టకరం.. పరామర్శించిన మంత్రి జూపల్లి
నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో : నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో జరిగిన ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వెంటనే వైద్యులు, సౌమ్య కుటుంబ సభ్యులు, ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స కోసం వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని సూచించినట్లు గుర్తుకు చేశారు.
ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం
సౌమ్య సంపూర్ణంగా కోలుకుటుందని ఆశిస్తున్నామని, సౌమ్యతో పాటు ఆమె కుటుంబాన్ని కూడా ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. సౌమ్యకు అయ్యే వైద్య ఖర్చులన్నింటినీ ప్రభుత్వం పూర్తిగా భరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఆమె కోలుకున్న అనంతరం ఆరోగ్య పరిస్థితిని బట్టి విధులు కేటాయిస్తామని, ఒకవేళ విధులు నిర్వర్తించే స్థితిలో లేకపోతే కూడా ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. సౌమ్య ఉద్యోగం పైనే ఆమె కుటుంబం ఆధారపడి ఉందని, కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో సౌమ్య చూపిన తెగువ, విధుల పట్ల ఆమెకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి ప్రశంసించారు.
ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను సహించేది లేదు..
ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఇప్పటికే ఈ కేసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిరిమాండ్ కు తరలించారని, పరారీలో ఉన్న నిందితుల కోసం వేట కొనసాగుతుందని వెల్లడించారు. ఇలాంటి సంఘనలు భవిష్యత్ లో పునరావృతం కాకుండా దర్యాప్తును వేగవంతం చేసి, నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నియంత్రణ, అక్రమ రవాణా, అమ్మ కాలు, వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా దృష్టి సారించిందని తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెంచి, దాడులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
ఇప్పటి వరకు 2,457 మందిపై ఎఫ్ఐఆర్‌లు..
ఇప్పటి వరకు 1,354 కేసుల్లో 2,457 మందిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామని, 5,196 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోనే 110 మందిపై 70 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలను సమర్థవంతంగా నియంత్రించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రి తెలిపారు. కొన్ని సందర్భాల్లో గంజాయి,ఇతర మాదకద్రవ్యాల సరఫరా ముఠాలు ఎక్సైజ్ అధికారులపై దాడులకు పాల్పడుతున్నాయని, దీనిని అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖకు కూడా ఆయుధాలు అందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ అంశం పరిశీలనలో ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అదేవిధంగా సౌమ్య ఆరోగ్య పరిస్థితి, ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం వారి వెంట నిలబడుతుందని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి వెంట ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ ఖురేషి, నిజామాబాద్, మెదక్ జిల్లాల డిప్యూటీ కమిషనర్లు సోమిరెడ్డి, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.






