- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణను అంతర్జాతీయ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ వెడ్డింగ్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ వెడ్డింగ్ డెస్టినేషన్ (international wedding destination)గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అక్షయ కన్వెన్షన్‌లో జరిగిన నాలుగవ సౌత్ ఇండియా వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ), పర్యాటక శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారతదేశం వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని, ఈ రంగంలో తెలంగాణ కీలక పాత్ర పోషించనుందని అన్నారు. పురాతన కోటలు, రాజమహల్స్, దట్టమైన అడవులు, నదులు, సరస్సులు, కొండలు, ఆధునిక విలాసవంతమైన హోటళ్లు వంటి అద్భుతమైన ప్రదేశాలు తెలంగాణలో ఉన్నాయని, ఇవి రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురాగలవని చెప్పారు. వెడ్డింగ్ ప్లానర్లు ఈ ప్రాంతాన్ని కేవలం ఒక రాష్ట్రంగా కాకుండా, ఒక జీవన సంస్కృతిగా చూసి అంతర్జాతీయంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
మీరు ఆలోచించండి, మేము అమలు చేస్తాం అనే నినాదంతో ముందుకు..
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, పెళ్లి కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదని, రెండు కుటుంబాలు, సంస్కృతుల సమ్మేళనమని అన్నారు. ఈ అపూర్వమైన క్షణాలను పదిలపరుచుకోవడానికి తెలంగాణలోని అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు అనువైనవని తెలిపారు. ఈ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. రాష్ట్రంలోని అత్యుత్తమ వెడ్డింగ్ డెస్టినేషన్‌లను ప్లానర్లకు పరిచయం చేయడానికి ప్రత్యేక ఫ్యామిలియరైజేషన్ (ఎఫ్ఏఎమ్) టూర్లు నిర్వహిస్తామని, అనుమతులు, లైసెన్సులు, లాజిస్టిక్స్ వంటి ప్రక్రియలను వేగవంతం చేస్తామని చెప్పారు. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో పెట్టుబడులను ఆకర్షించడానికి కొత్త విధానాలను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. "మీరు ఆలోచించండి, మేము అమలు చేస్తాం" అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, టీసీఈఐ అధ్యక్షుడు ఆళ్ల బలరాం బాబు, ప్రధాన కార్యదర్శి రవి బురా తదితరులు పాల్గొన్నారు.






