Jupally Krishna Rao: గోల్ఫ్ ఈవెంట్ తెలంగాణకు రావడం గర్వంగా ఉంది

by Gantepaka Srikanth |

గోల్ఫ్‌కు చిరునామాగా మారుతున్న హైదరాబాద్ మరో అతిపెద్ద టోర్నీకి వేదికైంది.

Jupally Krishna Rao: గోల్ఫ్ ఈవెంట్ తెలంగాణకు రావడం గర్వంగా ఉంది
X

దిశ, తెలంగాణ బ్యూరో: గోల్ఫ్‌కు చిరునామాగా మారుతున్న హైదరాబాద్ మరో అతిపెద్ద టోర్నీకి వేదికైంది. తొలిసారి భారత్ ఆతిథ్యమిస్తున్న ప్రతిష్టాత్మక 60వ ఐజీఎఫ్ఆర్ వరల్డ్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్‌ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్ షిప్ లో 24 దేశాలకు చెందిన 180 మంది రోటరీ గోల్ఫ్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. పలు సేవాకార్యక్రమాలను నిర్వహించే రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ గోల్ఫింగ్ ఫెలోషిప్ ఆఫ్ రోటారియన్స్ (ఐజిఎఫ్ఆర్) సహకారంతో ప్రసూతి ,శిశు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రతీ ఏడాదీ దీనిని నిర్వహిస్తోంది. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్, బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్ , వూటీ గోల్ఫ్ కౌంటీలలో ఈ ఛాంపియన్ షిప్ జరుగుతుంది. ఈ టోర్నీ ద్వారా కేవలం గోల్ఫ్ క్రీడ ప్రమోషన్ కోసమే కాకుండా మన దేశంలోని పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతలు, ఆతిథ్యం వంటి వాటిని విదేశీ గోల్ఫర్లకు అందించడమే లక్ష్యంగా ఉండబోతోంది. హైదరాబాద్ లో అద్భుతమైన ఫలఖ్ నామా ప్యాలెస్ , గోల్కొండ ఫోర్ట్ వంటి టూరిజం స్పాట్స్ నూ ఈ ఛాంపియన్ షిప్ లో భాగం చేశారు. టోర్నీలో ఆడుతున్న గోల్ఫర్లకు ఈ పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతలను వివరిస్తూ సందర్శన ఏర్పాటు చేయనున్నారు.

గోల్ఫ్ ఈవెంట్ తెలంగాణకు రావడం గర్వంగా ఉంది:

60వ ఐజీఎఫ్ఆర్ వరల్డ్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు దీనిలో పాల్గొంటున్న గోల్ఫర్లకు అభినందనలు తెలిపారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఇంత పెద్ద అంతర్జాతీయ గోల్ఫ్ ఈవెంట్ కు ఆతిథ్యమిచ్చే అవకాశం తెలంగాణకు రావడం గర్వంగా భావిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున టూరిజం శాఖ మంత్రిగా ఎటువంటి మద్ధతు కావాలన్నా అందిస్తామని తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ గోల్ఫ్ కోర్సులు హైదరాబాద్ లో ఉండడం, వాటిలోనే ఈ అతిపెద్ద టోర్నీ జరుగుతుండడం సంతోషంగా ఉందని మంత్రి జూపల్లి చెప్పారు. టూరిజం అభివృద్ధి క్రీడలతోనూ ముడిపడి ఉందని, ముఖ్యంగా విదేశీ పర్యాటకలకు అద్భుతమైన ఆతిథ్యం ఇవ్వడం తమ బాధ్యతగా చెప్పుకొచ్చారు. ఈ ఛాంపియన్ షిప్ లో పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులు హైదరాబాద్ ఆతిథ్యం స్వీకరించడమే కాకుండా ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ప్రత్యేకంగా వీక్షించాలని కోరారు. ప్రభుత్వం తరపున వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని, ప్రపంచ టూరిజంలో హైదరాబాద్ కు ఈ టోర్నీ ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుందని ఆకాంక్షించారు.

Next Story