- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
డబ్బు సంచులు వేసుకొని పెద్ద పెద్ద కార్లతో మెదక్ నియోజకవర్గంపై కన్నేశారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు.

దిశ, రామాయంపేట/ నిజాం పేట: డబ్బు సంచులు వేసుకొని పెద్ద పెద్ద కార్లతో మెదక్ నియోజకవర్గంపై కన్నేశారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లతో సోమవారం ఆయన కలిసి రెవెన్యూ డివిజన్ కార్యాలయం, డిగ్రీ కళాశాలలను ప్రారంభించి మాట్లాడారు. మెదక్ నియోజకవర్గం మీద కన్నేసిన కొంత మంది మా వద్ద పైసలు ఉన్నాయి.. మాకు పెద్ద పెద్ద కార్లు ఉన్నాయని పైసల సంచులు వేసుకొని మెదక్ మీద పడుతున్నారని, వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. వీళ్లంతా సంక్రాంతి పండుగకు గంగిరెద్దులు వచ్చినట్టు మెదక్ నియోజకవర్గానికి గంగిరెద్దులు వస్తున్నాయనీ, వీరి వల్ల అభివృద్ధి పూర్తిగా కుంటు పడే ప్రమాదం ఉంటుందని అన్నారు. సోనియా గాంధీని బలిదేవత అని.. కాంగ్రెస్ పార్టీని అవినీతి పార్టీ అని తిట్టిన రేవంత్ రెడ్డి నేడు కాంగ్రెస్ అభివృద్ధి గురించి ఎలా మాట్లాడుతాడని ప్రశ్నించారు.
రామాయంపేట డివిజన్ కావాలని గతంలో 500 రోజులు స్థానికులు నిరాహార దీక్షలు చేస్తే సీఎం ఇటీవల మెదక్ వచ్చి రెవెన్యూ డివిజన్, డిగ్రీ కళాశాల మంజూరు చేయడం జరిగిందన్నారు.రామాయంపేట నియోజకవర్గం కేంద్రంగా ఉండేదని.. అది పోగొట్టింది కాంగ్రెస్ పార్టీయే అని విమర్శించారు. ఇక నుండి డిగ్రీ చదవాలంటే మెదక్ కో, కామారెడ్డికో పోయే అవసరం లేదన్నారు. ఓట్ల కోసం డబ్బుల సంచులు పట్టుకొని వచ్చేటోడు కావాలా.. ఆపదలో మనకు తోడుగా ఉన్నవాళ్లు కావాలా మీరే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మెదక్ లో పద్మా దేవేందర్ రెడ్డిని గెలిపించుకొని అభివృద్ధిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలన అంటే కాలిపోయిన మోటర్లు, కాలిపోయిన ట్రాన్స్ ఫార్మర్ లు, దొంగ రాత్రికి చాలీచాలని కరెంటు మాత్రమేనని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడనీ, పదేండ్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనపైన చర్చ చేస్తా అంటున్నాడని విమర్శించారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ పాలన పై పోరాటం చేసిన రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడిన మాట నిజమా.. ఈనాడు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్న మాట నిజమా అని ప్రజలు గుర్తించాలన్నారు. రేవంత్ రెడ్డి ఏ ఎండకు ఆ గొడుగు పట్టి ఓట్ల కోసం దిగజారే ఊసరవెల్లిలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. మెదక్ ప్రజల కష్టంలో తోడుగా ఉన్న నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి అని, ఆమె గెలుపు మెదక్ అభివృద్ధికి మలుపు అని అన్నారు.
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమ కాలం నుండి కేసీఆర్ వెంట ఉండడం చాలా సంతోషకరమన్నారు. ఒకప్పుడు రామాయంపేటలో జడ్పీటీసీగా పని చేశానన్నారు. కష్టపడి పార్టీ కోసం తపన పడ్డానన్నారు. తన కష్టాన్ని తెలుసుకున్న సీఎం తనని గుర్తించారని గుర్తు చేశారు. మెదక్ జిల్లా మెడికల్ కాలేజీని సాధించుకోవడం జరిగిందన్నారు. మెదక్ లో కొన్ని నూతన మండలాలను ఏర్పాటు చేయాలనే కోరిక మేరకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి వాటిని ఏర్పాటు చేశారన్నారు. రామాయంపేటలో ఒక ఆధార్ కేంద్రాన్ని మంజూరు చేయాలని హరీశ్ రావుని కోరారు. రామాయంపేట 3 మండలాలకు డివిజన్ గా ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. "తంగేడు పువ్వులతో" అనే పాటతో సమావేశాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ హయాంలో బతుకమ్మ పండగను గుర్తించలేదన్నారు. మన తెలంగాణ వచ్చాక మన పండగలకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. బతుకమ్మ పండగను అమెరికా నుండి ఆఫ్రికా వరకు తీసుకెళ్లిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రిదే అని అన్నారు. పద్మ పల్లెటూరి మనిషే అన్నారు. ప్రతి రైతుకి న్యాయం చేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. చంద్రబాబు అరెస్ట్ అయితే రేవంత్ రెడ్డి ఏడవడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్ కు 45 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం చాలా సంతోషకరమన్నారు.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా, అడిషనల్ కలెక్టర్ రమేష్,రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు సరాఫ్ యాదగిరి, నాగరాజు, సుధాకర్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.






