- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ హ్యామ్ ప్రాజెక్టులకు వేగం.. టెండర్లపై మంత్రి ఫోకస్
రోడ్ల నిర్మాణంతో రాష్ట్రంలోని ప్రతి పల్లె, ప్రతి మండలం, ప్రతి పట్టణం అభివృద్ధి చెందుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రోడ్ల నిర్మాణంతో రాష్ట్రంలోని ప్రతి పల్లె, ప్రతి మండలం, ప్రతి పట్టణం అభివృద్ధి చెందుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రహదారుల అభివృద్ధి వల్ల పరిశ్రమలు ఏర్పడితే మౌలిక వసతులు పెరుగుతాయని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేయనున్న హ్యామ్ రోడ్ల విధానంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో దేశమంతా హ్యామ్ టెండర్లు ఎలా సాగుతున్నాయో ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. హ్యామ్ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి సోమవారం సచివాలయంలో అధికారులతో మూడు గంటల పాటు సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చేపడుతున్న హ్యామ్ రోడ్ల ప్రాజెక్టుల పురోగతి, పనుల నాణ్యత, నిర్మాణ వేగం, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై అధికారులతో మంత్రి సమగ్రంగా చర్చించారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ (మోర్త్) ప్రవేశపెట్టిన హ్యామ్ విధానాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్.హెచ్.ఎ.ఐ) 2016 నుంచి దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేస్తోందని అధికారులు మంత్రికి తెలిపారు. ఇప్పటివరకు 374కు పైగా ప్రాజెక్టులను రూ.4 నుంచి 5 లక్షల కోట్ల పెట్టుబడులతో చేపట్టినట్లు వెల్లడించారు.
జాతీయ స్థాయిలో విజయవంతమైన ఈ విధానాన్ని మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయని, అదే నమూనాలో తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్ర రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎక్సెస్ టెండర్లు అంటూ వస్తున్న ఆరోపణలపై మంత్రి అధికారులను అడిగారు. హ్యామ్ అమలు చేసిన మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణలోనే ఎక్సెస్ తక్కువగా ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అవి అసత్య ప్రచారాలు అని గణాంకాలతో సహా మంత్రికి వివరించారు.
ఫేజ్-1 కింద రూ. 13 వేల కోట్లతో 441 రోడ్లు..
ఫేజ్-1 కింద ఆర్అండ్‌బీ శాఖ ద్వారా రూ.13,006.27 కోట్ల వ్యయంతో 441 రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఇవి మొత్తం 6,092.37 కి.మీ పొడవుతో 34 ప్యాకేజీలుగా అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. అలాగే పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.6,250 కోట్లతో 2,162 రహదారుల నిర్మాణ పనులు 7,450 కి.మీ పొడవుతో 17 ప్యాకేజీల రూపంలో కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల అమలుకు ముందు టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీస్ నిర్వహించి, ఎన్.హెచ్.ఏ.ఐ నమూనాలోనే ఆర్.ఎఫ్.పీ, డీసీఏ డాక్యుమెంట్లు రూపొందించి పారదర్శకంగా టెండర్లు ఆహ్వానించినట్లు అధికారులు వివరించారు. సాధారణ రహదారి పనులతో పోలిస్తే హ్యామ్ ప్రాజెక్టుల్లో అదనపు ప్లాంట్ అండ్ మెషినరీ వినియోగం, ఆధునిక డిజైన్లు, సర్వేలు, 15 ఏళ్ల నిర్వహణ బాధ్యత, పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్స్ సేవలు, ఇండిపెండెంట్ ఇంజనీర్ ఛార్జీలు, జీఎస్టీ, వడ్డీ భారం వంటి అంశాల కారణంగా అదనపు వ్యయం ఉంటుందని అధికారులు తెలిపారు. జీఎస్టీ, వడ్డీ ప్రభావం వల్లే సుమారు 9.30 శాతం అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన హ్యామ్ ప్రాజెక్టుల్లో కూడా భారీ పాజిటివ్ ఎక్సెస్ బిడ్ ట్రెండ్ నమోదైందని వెల్లడించారు.
గుజరాత్‌లో 66 శాతం, మహారాష్ట్రలో 47 శాతం వరకు ఎక్సెస్ పాజిటివ్ బిడ్లు నమోదయ్యాయని తెలిపారు. ఎన్.హెచ్.ఏ.ఐ ప్రాజెక్టుల్లో కూడా 50 శాతం వరకు అధిక బిడ్లు వచ్చిన ఉదాహరణలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో ఇంధనం, బిటుమెన్, స్టీల్, సిమెంట్ తదితర నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరిగాయని.. బిటుమెన్ ధరలు దాదాపు 100 శాతం వరకు పెరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు వ్యయంపై 20 నుంచి 25 శాతం వరకు ప్రభావం పడుతుందన్నారు. టెండర్ ప్రక్రియ ప్రారంభమైన సమయంలో బిటుమెన్ ధర మెట్రిక్ టన్నుకు రూ.44 వేలుగా ఉండగా, ప్రస్తుతం రూ.89 వేల వరకు చేరిందని, అంటే దాదాపు 100 శాతం పెరుగుదల నమోదైందని అధికారులు వివరించారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇవాళ లేదా రేపు కలుస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ బి.వి రావు, పలువురు ఆర్అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.






