ఆరోగ్యశాఖలో దాదాపు 13 వేల పోస్టులను భర్తీ చేశాం: మంత్రి దామోదర్ రాజనర్సింహ

by Ajay Maddhiboyina |

గత రెండున్నరేళ్లలో ఆరోగ్యశాఖలో దాదాపు 13 వేల పోస్టులను భర్తీ చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.

ఆరోగ్యశాఖలో దాదాపు 13 వేల పోస్టులను భర్తీ చేశాం: మంత్రి దామోదర్ రాజనర్సింహ
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత రెండున్నరేళ్లలో ఆరోగ్యశాఖలో దాదాపు 13 వేల పోస్టులను భర్తీ చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. మంగళవారం కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్‌లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు పొందిన 1919 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించిన నర్సింగ్ ఆఫీసర్లకు, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం రోజునే నియామక పత్రాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇదే గ్రౌండ్‌లో ఇప్పటికే 1,257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలు అందజేసినట్లు మంత్రి రాజనర్సింహ గుర్తుచేసుకున్నారు. ఇక్కడే 623 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్‌లకు, 132 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్‌లకు నియామక పత్రాలు అందించామని తెలిపారు. గతంలో 6956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేశామని... రెండున్నర సంవత్సరాల్లో 9 వేల నర్సింగ్ పోస్టులను భర్తీ చేసిన ఘనత మన ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. దాదాపు మరో 5 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇందులో సుమారు 2 వేల ఏఎన్‌ఎం పోస్టుల ఫలితాలు మరో ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తామని అన్నారు. న్యాయపరమైన కారణాలతో ఆలస్యమైన 732 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీని కూడా త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రతి ప్రభుత్వ హాస్పిటల్‌ పూర్తిస్థాయిలో సిబ్బందితో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

నర్సులకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తాం...

దేశీయ, అంతర్జాతీయ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని నర్సింగ్ విద్యను విస్తరిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ రెండేళ్లలో కొత్తగా 16 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేశామని... అందులో 960 బీఎస్సీ నర్సింగ్ సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. విద్యానంతరం విదేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన స్కిల్స్‌ను ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థులకు నేర్పిస్తున్నామన్నారు. ముఖ్యంగా జర్మన్, జపాన్ దేశాల్లో ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఆ రెండు భాషలతో పాటు, ఇంగ్లీష్‌ నేర్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అర్హులైన నర్సులకు ప్రమోషన్లు కల్పించినట్లు వివరించారు. రాష్ట్రంలో దాదాపు 1 లక్షా 80 వేల మంది రిజిస్టర్డ్ నర్సులు సేవలందిస్తున్నారని... వారి సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధి కోసం ప్రత్యేక నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్యరంగంలో మార్పులకు అనుగుణంగా నర్సులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వం తరపున ప్రతి సంవత్సరం ట్రైనింగ్, స్కిల్ అప్‌గ్రేడేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 మిడ్‌వైఫరీ ట్రైనింగ్ కళాశాలలు మాత్రమే ఉండగా... అందులో కేవలం 90 సీట్లు మాత్రమే ఉన్నాయన్నారు. అందుకే దశలవారీగా అన్ని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలకు మిడ్‌వైఫరీ ట్రైనింగ్ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తామని... దీనివల్ల మాతా-శిశు ఆరోగ్య సేవలు మెరుగుపడతాయని... ప్రభుత్వ దవాఖాన్లలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరుగుతుందన్నారు. నర్సింగ్ వృత్తి అనేది సేవ, బాధ్యత, మానవత్వానికి ప్రతీక అని... రోగులకు కరుణతో, క్రమశిక్షణతో, నైతిక విలువలతో సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, మీర్జా రహ్మత్ బేగ్‌, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్‌ కుమార్, డీపీహెచ్ రవింద్ర నాయక్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

Next Story