- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీలో మంత్రి దామోదర్ కీలక ప్రకటన
రాష్ట్రంలో సబ్ సెంటర్ల నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వరకు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తూ సమగ్ర మార్పులు తీసుకువస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అసెంబ్లీలో ప్రకటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సబ్ సెంటర్ల నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వరకు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తూ సమగ్ర మార్పులు తీసుకువస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అసెంబ్లీలో ప్రకటించారు. బడ్జెట్ పద్దుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ.. పైసా ఖర్చు లేకుండా ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో డాక్టర్లపై పనిభారం తగ్గించేందుకు మెడికల్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌ను విభజించనున్నట్లు కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆరోగ్య రంగంలో భారీ నియామకాలు చేపట్టినట్లు వెల్లడించారు. గత రెండు సంవత్సరాల్లో 9,572 పోస్టులను భర్తీ చేయగా, ప్రస్తుతం 7,267 పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతోందని, మరో 2,929 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 19,768 పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతోందని వివరించారు. సెకండరీ హెల్త్ కేర్ సిస్టమ్‌ను పటిష్టం చేసేందుకు తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మారుస్తున్నామని, దీనివల్ల జిల్లా స్థాయిలోనే 80 శాతం వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ పథకంలో ప్రస్తుతం 1,835 చికిత్సలు అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి వెల్లడించారు. గతంలో ఏడాదికి 2.5 లక్షల మంది సేవలు పొందగా, ప్రస్తుతం ఆ సంఖ్య 4 లక్షలకు పెరిగిందన్నారు. మహిళల రక్షణ కోసం హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, 102 సెంటర్ల ద్వారా 15 వేల మందికి డయాలసిస్ సేవలు అందిస్తున్నామని, త్వరలో మరో 79 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 9 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పాటు నర్సింగ్ విద్యార్థినులకు విదేశాల్లో ఉద్యోగాల కోసం ఇంగ్లీష్, జపనీస్, జర్మన్ భాషల్లో శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర సేవల కోసం ప్రతి 35 కి.మీ.కు ఒక ట్రామా కేర్ సెంటర్ చొప్పున మొత్తం 109 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ట్రాన్స్‌జెండర్ల కోసం మైత్రి క్లినిక్స్, సంతానలేమి సమస్యల కోసం ఉచిత ఐవీఎఫ్ సేవలను అందిస్తున్నామని, హైదరాబాద్‌లో 7 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ వివరించారు.






