- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: డిజిటల్ హెల్త్ కార్డు జారీకి కసరత్తు
రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థను అమలు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థను అమలు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పన, అమలుపై రాష్ట్ర, జిల్లా స్థాయి వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమన్వయ సన్నాహాక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సంగారెడ్డి జిల్లాను డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలుకు పైలెట్ జిల్లాగా ఎంపిక చేసిన నేపథ్యంలో, ప్రాజెక్టు అమలు విధానం, ముందస్తు ఏర్పాట్లు, అవసరమైన సాంకేతిక సదుపాయాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్టు అమలులో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని మొత్తం 64 ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలు పొందేందుకు వచ్చే ప్రతి రోగికి సంబంధించిన పూర్తి ఆరోగ్య వివరాలతో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ను రూపొందించి డిజిటల్ హెల్త్ కార్డు జారీ చేయడానికి కసరత్తు చేయాలని మంత్రి ఆరోగ్యశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
డిజిటల్ రూపంలో రోగి వైద్య చరిత్ర..
రోగి ఆసుపత్రికి వచ్చిన మొదటి దశ నుంచి చికిత్స పూర్తయ్యే వరకు ఓపీ, మెడికల్ ఆఫీసర్, ల్యాబ్, ఫార్మసీ వంటి అన్ని విభాగాల్లో రోగి వైద్య చరిత్రను డిజిటల్ రూపంలో నమోదు చేసే విధంగా అవసరమైన ఐటీ సదుపాయాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని మంత్రి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు సూచించారు. డిజిటల్ హెల్త్ కార్డు ద్వారా రోగి పూర్తి వైద్య చరిత్ర డిజిటల్ రూపంలో అందుబాటులో ఉండటం వల్ల వైద్యులు తక్షణమే సరైన చికిత్స అందించడానికి సౌలభ్యం కలుగుతుందని మంత్రి తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న ఎన్‌సీడీ, కమ్యూనికేబుల్ డిసీజెస్, ఎంసిహెచ్, చైల్డ్ హెల్త్ సేవలు, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించి అవసరమైతే రిఫరల్ సిస్టమ్ ద్వారా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.
సంగారెడ్డి జిల్లాలో అమలు చేయనున్న ఈ పైలెట్ ప్రాజెక్టును అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ హెల్త్ కార్డు అమలు కోసం సంగారెడ్డి జిల్లాలో చేపట్టే ఈ పైలెట్ ప్రాజెక్టు ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్ చొంగ్తు, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో ఉదయ్ కుమార్ తో పాటు రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.






