నులిపురుగుల నివారణకు ‘ఆల్బెండజోల్‌’ మాత్రలు పంపిణీ.. 1-19 ఏళ్ల వయసు వారు వేసుకోవాల్సిందే!

by Ramesh Naini |

రాఖీ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేకంగా ఓ విజ్ఞప్తి చేశారు.

నులిపురుగుల నివారణకు ‘ఆల్బెండజోల్‌’ మాత్రలు పంపిణీ.. 1-19 ఏళ్ల వయసు వారు వేసుకోవాల్సిందే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాఖీ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) ప్రత్యేకంగా ఓ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా (Pinworms) నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయబోతున్నామని, ఈ విషయాన్ని రాఖీ కట్టే సమయంలో తమ అక్కాచెల్లెళ్లకు, అన్నాదమ్ముళ్లకు తెలియజేయాలని సూచించారు. 1-19 ఏళ్ల వయసున్న పిల్లలందరికీ ఈ మాత్రలు వేయించాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ సెంటర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

చిన్నారుల పేగుల్లో ఉండే నులిపురుగులను నివారించి, రక్త హీనతను అధిగమించేందుకు, రోగనిరోధక శక్తి పెంపొందించేందుకు ఈ మాత్రలు ఉపయోగపడుతాయని మంత్రి వివరించారు. 1-19 సంవత్సరాల వయసున్న పిల్లలందరూ నులిపురుగుల నివారణ మాత్ర (ఆల్బెండజోల్‌) వేసుకునేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి దామోదర రాజనర్సింహ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

Next Story