- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM రేవంత్ ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకురాబోతున్నారు: మంత్రి కీలక వ్యాఖ్యలు
ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించే విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజీ పడదని, ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించే విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజీ పడదని, ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా స్పష్టం చేశారు. 'ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక'లో భాగంగా సోమవారం నుంచి ప్రారంభమైన హెల్త్ వీక్ తొలిరోజును ఫుడ్ సేఫ్టీకి కేటాయించారు. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అవేర్‌నెస్ వాక్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం నేచర్ క్యూర్ హాస్పిటల్‌లో జరిగిన ఈట్ రైట్ మేళాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.41 లక్షల ఫుడ్ బిజినెస్ సంస్థలు ఉన్నాయని, అందులో 80 శాతం పట్టణ ప్రాంతాల్లోనే ఉండటంతో రెడీ టు ఈట్, ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం పెరిగిందని మంత్రి తెలిపారు. దీన్ని ఆసరాగా చేసుకుని నిత్యావసర వస్తువులైన ఉప్పు, పప్పులు, నూనెలను కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఆహారం వల్ల మధుమేహం, గుండె, మూత్రపిండాల వ్యాధులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నిర్మూలన కోసం అమల్లో ఉన్న ఈగిల్ వ్యవస్థ తరహాలోనే, ఆహార కల్తీని అరికట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకురానున్నారని మంత్రి వెల్లడించారు.
మిల్లెట్లతో ఆహారం తయారు..
ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని బలోపేతం చేసేందుకు కొత్తగా 24 మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను నియమించామన్నారు. నిజామాబాద్, హన్మకొండ, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో రూ.15 కోట్ల వ్యయంతో మూడు రీజినల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. నేచర్ క్యూర్ హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి సందర్శించి, కల్తీని గుర్తించే పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. మిల్లెట్లతో ఆహారం తయారు చేస్తున్న మహిళా సంఘాలను అభినందించారు. స్టాళ్ల సందర్శన అనంతరం జరిగిన సభలో స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు మంత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ, ఆహార నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్న పలు హోటళ్లు, రెస్టారెంట్ల ప్రతినిధులకు హైజీన్ సర్టిఫికెట్లను మంత్రి అందజేశారు. ఫుడ్ సేఫ్టీ - న్యూట్రీషియస్ ఫుడ్ ట్రైనింగ్‌లో పాల్గొన్న వారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం, సరైన నిద్ర, ప్రశాంతమైన జీవనశైలి అలవరచుకోవాలని ప్రజలకు సూచించారు. కల్తీపై సమాచారం ఉంటే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తూ, హెల్త్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






