పేదలెవరూ వైద్యానికి ఇబ్బంది పడొద్దు: మంత్రి దామోదర

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో పేదలెవరూ వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతోనే గాంధీలో రూ. 40 కోట్లతో అత్యాధునిక ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌ను నేడు అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు.

పేదలెవరూ వైద్యానికి ఇబ్బంది పడొద్దు: మంత్రి దామోదర
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పేదలెవరూ వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతోనే గాంధీలో రూ. 40 కోట్లతో అత్యాధునిక ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌ను నేడు అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ ను, మదర్ మిల్క్ బ్యాంక్ ను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం గాంధీ మెడికల్ కాలేజీ 68వ బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవంలో పాల్గొని పట్టాలు అందజేశారు. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌లో 6 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, 25 పడకల ఐసీయూలు, ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను మంత్రి ప్రారంభించారు. 18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ విజయవంతంగా పూర్తి చేసిన ఉస్మానియా గ్యాస్ట్రోఎంట్రాలజీ హెచ్‌వోడీ డాక్టర్ మధుసూదన్‌ను మంత్రి సన్మానించారు. గాంధీ ఆసుపత్రిలోని ఐవీఎఫ్ సెంటర్ ద్వారా చికిత్స పొంది, కవల పిల్లలకు జన్మనిచ్చిన దంపతులను మంత్రి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిస్సహాయ స్థితిలో ఉన్న దంపతులకు ప్రభుత్వ ఆసుపత్రి అండగా నిలవడం సంతోషదాయకమని, రాష్ట్రంలోని మరిన్ని ఆసుపత్రులకు ఐవీఎఫ్ సేవలను విస్తరిస్తామని భరోసా ఇచ్చారు.

గాంధీ ఘనత గొప్పది..

170 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన గాంధీ హాస్పిటల్ రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా ప్రాధాన్యం కలిగిన ఆసుపత్రిగా ఎదిగిందని... 1851లో చిన్న ఇన్ఫర్మరీగా ప్రారంభమైన ఈ ఆసుపత్రి, ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద టెర్టియరీ కేర్ సెంటర్లలో ఒకటిగా నిలిచిందని మంత్రి తెలిపారు. డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, కోవిడ్ వంటి మహమ్మారుల సమయంలో గాంధీ హాస్పిటల్ ముందుండి సేవలందించిందని... కోవిడ్ సమయంలో లక్ష మంది పేషెట్లకు చికిత్స అందించిన ఘనత గాంధీ సొంతమన్నారు. అరుదైన జబ్బుతో బాధపడుతున్న 18 నెలల చిన్నారికి.. రెండ్రోజుల క్రితమే ఉస్మానియా హాస్పిటల్‌లో సక్సెస్‌ఫుల్‌గా మన డాక్టర్లు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేశారని... లక్షల రూపాయలు ఖర్చయ్యే ఈ శస్త్రచికిత్సను ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా చేయించామని మంత్రి తెలిపారు. ఇలాంటి అవయవమార్పిడి వైద్య సేవలను విస్తరించేందుకు గాంధీ హాస్పిటల్‌లో రూ.40 కోట్లతో అత్యాధునిక స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేసుకుని, ఈరోజు ప్రారంభించుకునడం సంతోషంగా ఉందన్నారు. టిమ్స్ సనత్‌నగర్‌లో మరో ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ అందుబాటులోకి వస్తోందన్నారు. రాష్ట్రంలోని ఏడు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో ఆర్గాన్ రిట్రీవల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గోషామహల్‌లో 2,000 పడకలతో 2,700 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టాంమని... గాంధీ, ఉస్మానియా విద్యార్థుల కోసం 210 కోట్ల రూపాయలతో అత్యాధునిక హాస్టల్ భవనాలు నిర్మిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్, హెల్త్ వర్సిటీ వీసీ రమేశ్ రెడ్డి, డీఎంఈ నరేంద్ర కుమార్, గాంధీ ప్రిన్సిపాల్ డా.ఇందిర, సూపరింటెండెంట్ డా.వాణి, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రో హెచ్ఓడీ డా. మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story