- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: ఖాళీ పోస్టుల భర్తీపై కీలక ప్రకటన
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు సహా ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు సహా ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. గడిచిన రెండేళ్ల కాలంలో దాదాపు 10 వేల పోస్టులను భర్తీ చేశామని, మరో 7 వేలకు పైగా పోస్టుల రిక్రూట్‌మెంట్ ప్రక్రియ తుది దశలో ఉందని ఆయన వెల్లడించారు. మంగళవారం శాసనమండలిలో ప్రభుత్వ హాస్పిటళ్లలో సిబ్బంది కొరతపై సభ్యులు తక్కళ్లపల్లి రవీందర్, బండ ప్రకాశ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఒకేసారి భారీ సంఖ్యలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడంతో డాక్టర్ల కొరత తీవ్రమైందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు కావాల్సిన అర్హతలు ఉన్న డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఆ పోస్టుల భర్తీ ఇబ్బందిగా మారిందని వివరించారు. అయినప్పటికీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 1200 టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేశామని ఆయన పేర్కొన్నారు.
వైద్య శాఖలో వివిధ కేటగిరీల పోస్టుల భర్తీకి సంబంధించి మంత్రి కీలక గడువులను ప్రకటించారు. రెగ్యులర్ బేసిస్‌లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని, ఏప్రిల్ కల్లా ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. వైద్య విధాన పరిషత్ హాస్పిటళ్లలో 1,616 స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకం మరో నెల రోజుల్లో ముగుస్తుందన్నారు. ఇప్పటికే 7 వేల మందిని నియమించామని, మరో 2,312 పోస్టుల భర్తీ ఏప్రిల్‌లో పూర్తి చేస్తామన్నారు. గత రెండేళ్లలో 1,500 మందిని నియమించినట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఏ ఒక్క ప్రైవేటు షాపుకు పర్మిషన్ ఇవ్వలేదని మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. మండలిలో సభ్యులు ఎల్ రమణ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. గతంలో ఉన్న వాటిని కూడా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే కొన్ని షాపుల యజమానులు కోర్టు నుంచి స్టేలు తెచ్చుకుని కొనసాగుతున్నారని తెలిపారు. కోర్టు నుంచి అనుమతి రాగానే వాటిని తొలగిస్తామన్నారు. ప్రజలకు చౌకగా మందులు అందేలా జనరిక్ మెడికల్ షాపులను ప్రోత్సహిస్తామని మంత్రి రాజనర్సింహ వివరించారు. ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మొత్తం 65 మెడికల్ షాపులుంటే.. దాంట్లో ఆరు ప్రైవేటు బ్రాండెడ్ మెడికల్ షాపులున్నాయని చెప్పారు.






