ఫుడ్ బాలేదని హాస్టల్ పిల్లల నుంచి కంప్లైంట్ రావొద్దు: మంత్రి అడ్లూరి ఆదేశం

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలు అత్యుత్తమ ప్రమాణాలతో ఉండాలని.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు.

ఫుడ్ బాలేదని హాస్టల్ పిల్లల నుంచి కంప్లైంట్ రావొద్దు: మంత్రి అడ్లూరి ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలు అత్యుత్తమ ప్రమాణాలతో ఉండాలని.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్‌లో వెల్ఫేర్ హాస్టళ్ల పరిస్థితులపై శుక్రవారం విస్తృత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద, బలహీన వర్గాల విద్యార్థుల కోసం శుభ్రమైన వసతి, పోషకాహార భోజనం, పరిశుభ్రమైన వంటగదులు, సురక్షితమైన తాగునీటి సదుపాయం తప్పనిసరిగా ఉండాలని సూచించారు. సంక్షేమ హాస్టళ్లలో ఆహార నాణ్యత, సరఫరా, క్వాలిటీ కంట్రోల్‌పై అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని మంత్రి ఆదేశించారు.

జిల్లా అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు చేసి, విద్యార్థుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటిని సాధ్యమనంతా మేరకు వెంటనే పరిష్కరించాలని సూచించారు. సంక్షేమ హాస్టళ్లకు పంపిణీ చేసేందుకు నిర్వహించే ప్రొక్యూర్మెంట్ టెండర్ విధానంలో సూచించిన విధంగా అన్నిరకాల సరఫరాలు ఆహార పదార్థాలు, వంట సామగ్రి, హాస్టల్‌ అవసరాలకు అవసరమైన వస్తువులు పారదర్శకంగా, నాణ్యతతోపాటు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం దళిత, గిరిజన బలహీన వర్గాల అభివృద్ధికి అభ్యున్నతికి కట్టుబడి ఉందని, సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల విద్య, సంక్షేమం, సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. హాస్టళ్ల ఆధునికీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ హాజరు వ్యవస్థలు, డిజిటల్‌ మానిటరింగ్‌ మెకానిజమ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా బాధ్యతా స్పృహ, భద్రత పెరగాలని సూచించారు.

జిల్లా కలెక్టర్లతో సమన్వయం కొనసాగిస్తూ హాస్టళ్లలో ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో సంక్షేమ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సభ్య సాచి ఘోష్‌, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ బుద్ధప్రకాశ్‌, కమిషనర్‌ క్షితిజా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల సొసైటీ కార్యదర్శులు కృష్ణ ఆదిత్య, సీతాలక్ష్మి, షఫీయుల్లా తదితరులు పాల్గొన్నారు.

Next Story