‘రేవంత్ రెడ్డిని ఓడిస్తాననడం తగదు’: జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు.

‘రేవంత్ రెడ్డిని ఓడిస్తాననడం తగదు’: జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ప్రజలకు మేలు చేసే ప్రభుత్వంపైనే విమర్శలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిని ఓడించడమే తన ధ్యేయమని జీవన్ రెడ్డి అనడం ఎంతవరకు సబబని మంత్రి ప్రశ్నించారు. "గత రెండున్నరేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతూ.. ఇప్పుడు కాంగ్రెస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అనడం ఏంటి?" అని ఆయన నిలదీశారు. పార్టీతో 40 ఏళ్ల అనుభవం ఉన్న నేత ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓటమి పాలైనప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చూపిన చొరవను మంత్రి అడ్లూరి ఈ సందర్భంగా గుర్తు చేశారు. జీవన్ రెడ్డి ఓడిపోయారని తెలిసిన 10 నిమిషాలకే రేవంత్ రెడ్డి ఆయనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ఓడినా సరే, జీవన్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటామని రేవంత్ రెడ్డి అప్పట్లో హామీ ఇచ్చారని వెల్లడించారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారికి మంత్రి పదవులు ఇవ్వకూడదన్న హైకమాండ్ నిబంధనల వల్లే ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారే తప్ప, జీవన్ రెడ్డికి అన్యాయం చేయాలనే ఉద్దేశం ఆయనకు లేదని స్పష్టం చేశారు.

పార్టీ ఏనాడూ అన్యాయం చేయలేదు..

కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి ఎప్పుడూ అన్యాయం చేయలేదని, ఆయన సీనియారిటీని గౌరవించిందని మంత్రి అన్నారు. "ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 14 సార్లు కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి బీఫామ్ ఇచ్చింది. ఇంతటి గౌరవం పొంది కూడా ఇప్పుడు పార్టీని, ముఖ్యమంత్రిని విమర్శించడం దురదృష్టకరం" అని మంత్రి వ్యాఖ్యానించారు. వ్యక్తిగత అసంతృప్తితో పార్టీ పునాదులను దెబ్బతీసేలా మాట్లాడటం మానుకోవాలని, ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలని జీవన్ రెడ్డికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు.

Next Story