గురుకులాల్లో ప్రవేశాల జోరు.. నాణ్యమైన విద్యపై పెరిగిన నమ్మకం

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాసంస్థలపై పేద, అణగారిన వర్గాల విద్యార్థుల్లో విశ్వాసం పెరుగుతోంది. ఈ ఏడాది ఇంటర్ ప్రవేశాలకు రాష్ట్రవ్యాప్తంగా 45 వేల 357 దరఖాస్తులు అందగా, మే 15న నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 39 వేల 52 మంది విద్యార్థులు (86.09 శాతం) హాజరయ్యారు.

గురుకులాల్లో ప్రవేశాల జోరు.. నాణ్యమైన విద్యపై పెరిగిన నమ్మకం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాసంస్థలపై పేద, అణగారిన వర్గాల విద్యార్థుల్లో విశ్వాసం పెరుగుతోంది. ఈ ఏడాది ఇంటర్ ప్రవేశాలకు రాష్ట్రవ్యాప్తంగా 45 వేల 357 దరఖాస్తులు అందగా, మే 15న నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 39 వేల 52 మంది విద్యార్థులు (86.09 శాతం) హాజరయ్యారు. మొత్తం 19 వేల 740 సీట్లకు గాను, మొదటి విడతలోనే 18 వేల 401 సీట్లు భర్తీ అయ్యాయి. ప్రస్తుతం కేవలం 1,339 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికి గాను సైనిక పాఠశాలలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, నాన్-సీవోఈ, ఒకేషనల్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. విద్య ద్వారానే సామాజిక అసమానతలను తొలగించవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమ్ముతున్నారని, పేద పిల్లలను దేశ భవిష్యత్తు నిర్దేశకులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

గురుకుల విద్యాసంస్థలను దేశానికే ఆదర్శంగా మారుస్తున్నామని తెలిపారు. కార్పొరేట్ స్థాయి విద్యను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గురుకులాల్లో అమలు చేస్తున్న మైక్రో అకడమిక్ ప్లానింగ్, వారానికో మాక్ టెస్టు, నిపుణులైన అధ్యాపకుల శిక్షణ కారణంగానే నేడు జాతీయ స్థాయిలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని వివరించారు. జేఈఈ మెయిన్-2026లో 337 మంది విద్యార్థులు అర్హత సాధించడం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించడం ఈ విద్యా వ్యవస్థ సామర్థ్యానికి నిదర్శనమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొనియాడారు. మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలతో జూన్ 7వ తేదీలోపు సంబంధిత కళాశాలల్లో రిపోర్టు చేయాలని మంత్రి సూచించారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులను మొదటి రోజే కళాశాలలకు పంపించాలని తల్లిదండ్రులను కోరారు. ఇకపై ప్రతి నెలా తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి, వారి సలహాలు, సూచనలను స్వీకరిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి కంభంపాటి శారద, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గ్రూపుల వారీగా భర్తీ వివరాలు..

ఎంపీసీ: 8,156 సీట్లు (96.63 శాతం)

బైపీసీ: 7,425 సీట్లు (90.00 శాతం)

సీఈసీ: 1,500 సీట్లు (98.68 శాతం)

హెచ్ఈసీ: 257 సీట్లు (98 శాతం)

ఎంఈసీ: 377 సీట్లు (72 శాతం)

వొకేషనల్ కోర్సులు: 686 సీట్లు

Next Story