- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్సీ సంక్షేమానికి కేంద్రం తక్షణ నిధులు విడుదల చేయాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
వెనుకబడిన వర్గాల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనికి కేంద్రం సహకారం అత్యంత

దిశ, తెలంగాణ బ్యూరో: వెనుకబడిన వర్గాల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనికి కేంద్రం సహకారం అత్యంత అవసరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కేంద్ర నిధులు సకాలంలో విడుదలయితే రాష్ట్ర సంక్షేమ పథకాలు మరింత వేగంగా అమలయ్యే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం కేంద్రం నుంచి విడుదల కావాల్సిన నిధులను తక్షణమే విడుదల చేయాలని మంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలేకు వినతిపత్రం సమర్పించారు. ఈ భేటీలో పెండింగ్‌లో ఉన్న నిధుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన మంత్రి లక్ష్మణ్ కుమార్, నిధుల విడుదల ఆలస్యం వల్ల సంక్షేమ పథకాల అమలుకు ఆటంకం కలుగుతోందని తెలిపారు. తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రూ.232.68 కోట్ల బకాయిల విడుదలకు కేంద్రం స్పందించాలి:
ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం ఉద్దేశించిన పీసీఆర్/పీఓఏ చట్టాల అమలుకు సంబంధించిన రూ.232.68 కోట్ల బకాయిలు, అలాగే పీఎం-అజయ్ పథకం కింద 2025-26 సంవత్సరానికి గాను రూ. 82.20 కోట్ల నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను ఇప్పటికే విడుదల చేసినప్పటికీ, కేంద్రం నుంచి నిధులు అందకపోవడంతో ఈ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని మంత్రి వివరించారు. ఈ నిధుల విడుదల ఎస్సీ వర్గాల అభివృద్ధి, సాధికారతకు ఎంతగానో దోహదపడుతుందని, దీనిపై కేంద్రం అత్యంత ప్రాధాన్యతతో దృష్టి సారించాలని కోరారు.
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు కేంద్రం సహకారం అవసరం:
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల' ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 1,023 రెసిడెన్షియల్ పాఠశాలల్లో 650 పాఠశాలలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, దీనివల్ల విద్యా ప్రమాణాలపై ప్రభావం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపయోగపడతాయని, 55 ప్రాజెక్టుల కోసం ఇప్పటికే రూ.200 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల విజయవంతమైన అమలుకు కేంద్రం ఆర్థిక సహాయం అందించాలని స్పష్టం చేశారు.






