Adluri: అప్పుడు మీరంతా ఎక్కడ దాక్కున్నారు? బీఆర్ఎస్ నేతలపై మంత్రి అడ్లూరి ఫైర్

by Prasad Jukanti |

కేబినెట్ భేటీలో చర్చపై హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి అడ్లూరి డిమాండ్ చేశారు.

Adluri: అప్పుడు మీరంతా ఎక్కడ దాక్కున్నారు? బీఆర్ఎస్ నేతలపై మంత్రి అడ్లూరి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కేబినెట్‍పై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) మండిపడ్డారు. అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అని దుయ్యబట్టారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన అడ్లూరి.. కేబినెట్ భేటీపై చేసిన వ్యాఖ్యలకు గాను హరీశ్ రావు (Harish Rao) బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేదా తన వ్యాఖ్యలు నిజం అని నిరూపించేందుకు హరీశ్ సెంటిమెంట్‍గా భావించే సిద్ధిపేట వెంకటేశ్వర ఆలయంలో ప్రమాణం చేసేందుకు రావాలని చాలెంజ్ విసిరారు. కేబినెట్ మంత్రులను దండుపాళ్యం బ్యాచ్ అంటారా? కేబినెట్‍లో జరగని విషయాలను జరిగాయని ప్రచారం చేయడం దుర్మార్గం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలపై దాదాపు 600 పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారని, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై గత ప్రభుత్వం క్రూరంగా ప్రవర్తించిందని ఆరోపించారు.

మాఫియా, డాన్‍లు, కాంట్రాక్టులు, కమిషన్ల గురించి బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, బ్లాక్‌ మెయిలింగ్‌ చేయడంలో దిట్ట అయిన బాల్క సుమన్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మంత్రుల గురించి మాట్లాడే ముందు కేసీఆర్‌ పదేళ్ల పాలనపై ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మంత్రి అడ్లూరి సూచించారు. రైతుల చేతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదని అధికారంలో ఉన్న పదేళ్లు మేమే రాజులం మేమే మంత్రులం అన్నట్టు వ్యవహరించారని మండిపడ్డారు. ప్రవీణ్‌ కుమార్‌ నేతృత్వంలో గురుకులాల పరిస్థితిని, ప్రస్తుతం గురుకులాల్లో పరిస్థితులను బేరీజు వేసుకుంటే బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం కాంగ్రెస్‌ ఎంత ప్రాధాన్యతిస్తుందో స్పష్టమవుతోందన్నారు. కేసీఆర్‌ హయాంలో గురుకులాలు అస్తవ్యస్తంగా ఉన్నా నోరు ఎత్తని ప్రవీణ్‌ కుమార్‌ ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కొందరు గురుకులాల విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేసి సొంత సైన్యాన్ని నిర్మించుకొని ప్రవీణ్‌ కుమార్‌ చేసిన అరాచకాలు బహిరంగ రహస్యమేనన్నారు. తాను ఐపీఎస్‌ అధికారి అని చెప్పుకునే ప్రవీణ్‌ కుమార్‌ తెలంగాణలో సంచలనం రేపిన నేరెళ్ల సంఘటనపై ఎందుకు నోరు మెదపలేదు? అని ప్రశ్నించారు. అప్పుడు బీఆర్‌ఎస్‌ నేతలను కేసీఆర్‌ ప్రభుత్వం కాపాడుతుంటే దళితులకు న్యాయం కోసం ప్రవీణ్‌ కుమార్‌ ఎందుకు ముందుకు రాలేదని నిలదీసారు.

ఉద్యమం పేరుతో యువతను, విద్యార్థులను రెచ్చగొట్టిన బాల్క సుమన్‌ బీఆర్‌ఎస్‌లో పదవులు అనుభవించారే కానీ, యువత కోసం ఎప్పుడు పోరాడలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఉద్యోగ నియామకాలు లేకుండా యువత ఉద్యమిస్తుంటే యువనేతగా చెప్పుకునే సుమన్‌ ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబంతో సన్నిహితంగా మెలిగే బాల్క సుమన్‌ వారి అండతో చేసిన అరాచకాలపై చర్చకు సిద్ధమా? అన్నారు. శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్న ప్రవీణ్‌ కుమార్‌ బీఆర్‌ఎస్‌ హయాంలో కేసీఆర్‌ కుటుంబం చేసిన ఫోన్‌ ట్యాపింగ్‌, దౌర్జన్యాల గురించి చర్చకు మందుకొస్తారా? సొంత కుటుంబ సభ్యులను, మంత్రుల ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి తమ చెప్పుచేతల్లో పెట్టుకున్న కేటీఆర్‌ గురించి ప్రవీణ్‌ కుమార్‌ ముందుగా మాట్లాడితే మంచిదనిన్నారు. సొంత మంత్రులపైనే నిఘా పెట్టి బ్లాక్‌ మెయిలింగ్‌ చేసిన కేసీఆర్‌ కుటుంబానికి దాసోహమైన ప్రవీణ్‌ కుమార్‌, బాల్క సుమన్‌‍లకు కాంగ్రెస్‌ మంత్రులపై మాట్లాడే హక్కే లేదన్నారు . సోషల్‌ మీడియాలో కేసీఆర్‌ ప్రభుత్వం అరాచకాలను ప్రశ్నించిన వారిని వేధించిన ఘటనలను ప్రవీణ్‌ కుమార్‌ మర్చేపోయారని, గ్రేటర్‌ చుట్టు పక్కల భకబ్జాలకు పెట్టింది పేరు కేటీఆర్‌ అండ్‌ కంపెనీ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యుల బెదిరింపులకు, అరాచకాలకు బెడిరి ఎన్నో కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్లిన సంగతి వీరికి తెలియదా? అన్నారు.

Next Story